హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): జూలై 1 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ ముస్కాన్-9’ ద్వారా 2,617 మంది చిన్నారులను వెట్టిచాకిరి నుంచి విముక్తి చేసినట్టు ఉమెన్‌సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖాగోయల్ తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వీరిలో 2230 మందిని తల్లిదండ్రుల వద్దకు చేర్చినట్టు చెప్పారు. మొత్తం 429 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, 436 మంది నిందితులను అరెస్టు చేశామని చెప్పారు.
తెలంగాణ ఉమెన్ సేఫ్టీవింగ్ ఆధ్వర్యంలోని ‘యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్’ ప్రత్యేక బృందాలు, ప్రతి సబ్ డివిజన్లోని 753 మంది పోలీసు సిబ్బంది కలిసి ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్టు వివరించారు. మహిళా శిశు సంక్షేమం, కార్మిక, ఆరోగ్య శాఖల సమన్వయంతో సీడబ్ల్యూసీ కమిటీలు, జిల్లా చైల్డ్‌ప్రొటెక్షన్ యూనిట్లు, ఎన్జీవోల సహకారంతో తప్పిపోయిన, పలుచోట్ల వెట్టిచాకిరి చేస్తున్న చిన్నారులను కాపాడి ఇండ్లకు చేర్చినట్టు వెల్లడించారు. తప్పిపోయిన పిల్లలు, బాలకార్మికులు, భిక్షాటన, అక్రమ రవాణాకు గురైన పిల్లలను కనుగొనడానికి తెలంగాణ పోలీసుల టీఎస్ కాప్, దర్పణ్ యాప్‌ను ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పదంగా బాల కార్మికులు కనిపిస్తే 9440700906 నంబర్‌కు ఫోన్ లేదా womensafety-ts@tspolice.gov.inకి మెయిల్ చేయాలని కోరారు.