దుమ్ముగూడెం/ చుంచుపల్లి/ ఇల్లెందురూరల్/ చారకొండ, ఏప్రిల్ 25 : భద్రాద్రి కొత్తగూడెం, నాగర్కర్నూల్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో శుక్రవారం మంచినీళ్లు అందించండి.. మహాప్రభో! అంటూ ఖాళీ బిందెలతో గ్రామస్థులు, మహిళలు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కాటాయిగూడెం, చుంచుపల్లి మండలం మాయాబజార్, ఇల్లెందు మండలం నెహ్రూనగర్, నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం అగ్రహారం తండాలో మహిళలు రోడ్డుపైకి వచ్చి తమ గోడు వెల్లబోసుకున్నారు.
20రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు, మహిళలు మోటరు వద్ద ఖాళీ బిందెలు, బకెట్లతో నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పంచాయతీ సిబ్బంది అక్కడకు చేరుకుని మోటరుకు మరమ్మతులు చేపట్టారు. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం అగ్రహారం తండాలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ కావడంతో పైపులకు మరమ్మతులు చేపట్టారు.