నర్సింహులపేట, డిసెంబర్ 8 : ‘కల్యాణలక్ష్మితో తులం బంగారం ఇస్తమన్నరు, ఎప్పుడిస్తరు? మహిళలకు రూ.2500 ఏమైనయ్? గ్యాస్ సబ్సిడీ రూ.500 ఎప్పుడు వేస్తరు? అంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రూప్లాతండా జీపీ పరిధి ఎర్రచక్రుతండాలో మహిళలు ఎమ్మెల్యే రామచంద్రూనాయక్ను నిలదీశారు. అంతేగాక తాగునీరు, బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. కొమ్ములవంచలో ఉన్న వాళ్లకే ఇండ్లు ఇచ్చారని కాంగ్రెస్ కార్యకర్త గొడవ చేశాడు.
ఇక్కడ షెడ్యూల్ ప్రకారం ప్రచారం లేకపోయినా రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఎమ్మెల్యే యత్నించగా కార్యకర్తలు కారు వద్ద అడ్డుకున్నారు. ఇక కౌసల్యాదేవిపల్లిలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించకపోతే ఇందిరమ్మ ఇండ్లు కట్ చేస్తామని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై జనాల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఎన్నికలకు, ప్రభుత్వ పథకాలకు లింక్పెట్టి మాట్లాడటం ఎమిటని జనాలు నిలదీశారు. కోడ్ ఉల్లంఘిస్తూ లోక్యాతండా జీపీ పరిధి మూడ్తండాలో పాఠశాల ముందు రోడ్డుపై కార్యకర్తలతో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం చేశారు.