దోమ, మే 14 : తాగు నీటికోసం వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూర్ వాసులు రోడ్డెక్కారు. స్థానిక గాలి పోచమ్మ కాలనీకి వారం రోజులుగా తాగునీరు రాకపోవడంతో గుక్కెడు నీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం మోత్కూర్ నుంచి అయినాపూర్ వెళ్లే ప్రధాన రోడ్డుపై ఖాళీ బిందెలతో మహిళలు బైఠాయించారు. నీటి సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన కరువైందని మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి తాగు నీటి సమస్యను తీర్చాలని, లేకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.