నూతనకల్, డిసెంబర్ 10 : రుణమా ఫీ కాలేదని మహిళా రైతులు భగ్గుమన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని వెంకేపల్లిలో మంగళవారం మహిళలు తుంగతుర్తి ఎమ్యెల్యే మందుల సామేల్‌ను నిలదీశారు. వెంకేపల్లిలో బండి యాదగిరి విగ్రహావిష్కరణ స్థల పరిశీలన కోసం ఎమ్యెల్యే రాగా.. మహిళలకు అక్కడికి చేరుకున్నారు. కాం గ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి.. ఇప్పటివరకు పూర్తి చేయలేదని అన్నారు. రైతు భరోసా ఇస్తామని చెప్పినా ఆ ఊసే లేదని ఎమ్మెల్యేను నిలదీశారు. రానున్న స ర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేయలేమని తేల్చిచెప్పారు. నెల రోజుల్లో అర్హులైన వారందరికీ రైతు రుణ మాఫీ చేస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.
వైరాటౌన్, డిసెంబర్ 10 : ఎలాంటి షరతులు విధించకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరా తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేశ్, బొంతు రాంబాబు మాట్లాడుతూ.. జిల్లాలో లక్ష మంది రైతులకు పైగా రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. బ్యాంకులో అప్పు ఉండి చనిపోయిన రైతులకు, పట్టాదారు పాస్ పుస్తకం లేని రైతులకు రుణమాఫీ చేయడం లేదని ఆరోపించారు. బ్యాంకులో అప్పు ఉన్న ప్రతి రైతుకు రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కేవీ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు.
పెబ్బేరు, డిసెంబర్ 10 : కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేసి అధికారం కట్టబెడితే తమను నట్టేట ముంచిందని పలువురు రైతులు, మ హిళలు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి వద్ద వాపోయారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మం డలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాల ను మంగళవారం పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులను మృతుల కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బూడిదపాడు, కొత్తసూగూరు గ్రా మాలకు చెందిన మహిళలు, రైతులు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తంచేశారు. అర్హ త ఉన్నా ఆసరా పింఛన్లు ఇవ్వ డం లేదని, ఏడాదైనా పింఛన్లు పెంచలేదని ఆరోపించా రు. రుణమాఫీ అమలు సక్రమంగా లేదని, లక్షలోపు రు ణాలు ఉన్న వారికే మాఫీ చేశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వ దురాగతాలు, ప్రజావ్యతిరేక చర్యలను ఎండగట్టాలని సూచించారు.
పర్వతగిరి, డిసెంబర్ 10: కాంగ్రెస్ సర్కారు రైతులను నిండా ముంచిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. మంగళవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, డీసీసీ బ్యాంకులకు ఆయన రైతులతో కలిసి వెళ్లి రుణమాఫీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఐవోబీలో 450 మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదని, కేవలం 22 మందికే ఇటీవల క్లియరెన్స్ వచ్చిందని బ్యాంకు సిబ్బంది తెలిపారు. పీఎన్బీలో 456 మంది రైతులకు 356 మందికి, డీసీసీబీలో రైతులకు రూ.25 కోట్ల రుణం ఉండగా రూ.14 కోట్లు మాత్రమే రుణమాఫీ అయినట్టు బ్యాంకర్లు ఎర్రబెల్లికి తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. రైతుబంధుకు రాంరాం చెప్పి రుణమాఫీ పేరుతో అనేక ఆంక్షలు విధించి రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్ కలెక్టరేట్, డిసెంబర్ 10: రుణమాఫీపై గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. తనకెందుకు రుణమాఫీ చేయలేదో చెప్పాలని ఓ రైతు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన చింతల మల్లారెడ్డి అక్టోబర్ 2019లో తీసుకున్న రూ.1.09 లక్షల వ్యవసాయ రుణం మాఫీ కాకపోవడంతో అధికారుల చుట్టూ తిరిగి వేసారి మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన రైతు పండుగ ఫ్లెక్సీ వద్ద గంటకుపైగా నిల్చుని నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సక్రమంగానే వడ్డీ చెల్లించినా.. తన పేరును రుణమాఫీ జాబితాలో చేర్చకపోవడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించాడు. ఎల్ఎండీలోని ఎస్బీఐలో రుణం తీసుకోగా జాబితాలో తన పేరెందుకు లేదని అడిగితే వ్యవసాయాధికారుల వద్ద తెలుసుకోవాలని సూచిస్తున్నారని, అక్కడికెళ్లి అడిగితే బ్యాంకులో అడగాలని చెప్తున్నారని వాపోయాడు.
బోనకల్లు, డిసెంబర్ 10 : రుణమాఫీ కోసం ఖమ్మం జిల్లా రైతులు లేఖల పరంపర కొనసాగిస్తున్నారు. రూ.2 లక్షలలోపు రుణం మాఫీ కాలేదని లేఖలు రాసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పోస్టుచేస్తున్నారు. సోమవారం ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామ రైతులు లేఖలు పోస్టుచేయగా.. మంగళవారం బోనకల్లు మండలం తూటికుంట్ల గ్రామ రైతులు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి లేఖలు పోస్టుచేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా నాలుగు విడతల్లో 50 శాతం కూడా రుణమాఫీ కాలేదని అన్నారు. రుణమాఫీ పూర్తయ్యే వరకు పోరుబాట కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఇనుగుర్తి, డిసెంబర్ 10: షరతుల్లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని ఆరోపించారు. ఇనుగుర్తిలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 1800 మంది రైతులు రుణం తీసుకోగా, 695 మందికి మాత్రమే మాఫీ అయినట్టు తెలిపారు. దీన్నిబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సగం మందికి కూడా మాఫీ చేయలేదని విమర్శించారు. రూ.2 లక్షల లోపు రుణం తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు మాఫీ చేసే వరకు ప్రభుత్వంతో కొట్లాడుతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.