జహీరాబాద్, డిసెంబర్ 22: చిరుధాన్యాల సాగుతో ఆహార భద్రత సాధ్యమని మహిళా రైతులు ఉద్ఘాటించారు. ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుండడంతో చిన్న, సన్నకారు రైతులు కనుమరుగు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘చిరుధాన్యాలతో ఆహార సార్వభౌమత్యం’ అనే అంశంపై శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్‌లో సదస్సు నిర్వహించారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు సంగారెడ్డి, వరంగల్, వికారాబాద్, యాదాద్రి జిల్లాల నుంచి మహిళా రైతులు హాజరై వ్యవసాయంలో వస్తున్న మార్పులపై చర్చించారు. ఏటా విత్తనాలు వేసే సమయంలో వాతావరణ మార్పులు సంభవిస్తుండటంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వాతావరణ మార్పులను తట్టుకునే పంటల సాగుకు అవసరమైన విత్తనాల ఉత్పత్తిని ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. చిరుధాన్యాలకు మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ దిగుబడి సరిగా లేదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి, వరి పంటల సాగును తగ్గించి చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, వీటికి మద్దతు ధర కలిపించాలని విజ్ఞప్తి చేశారు. పాత పంటలను పండించే రైతులకు రైతుబంధుతోపాటు రూ.10 వేల చొప్పున బోనస్ అందించాలన్నారు. సదస్సులో డీడీఎస్ డైరెక్టర్ డాక్టర్ రుక్మిణిరావు, ప్రముఖ జర్నలిస్టులు కే సజేయ, రమేశ్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.