హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌లో పదవుల లొల్లి కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గాంధీభవన్‌లోని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చాంబర్ ఎదుట బుధవారం మహిళా కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ప్రభుత్వం, కార్పొరేషన్ పదవుల్లోనూ మహిళా నేతలకు సరైనా ప్రాధాన్యత దక్కడంలేదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. పదవులన్నీ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ బంధువులకే ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు.
ఎన్నో ఏండ్ల నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తమకు కాంగ్రెస్‌లో తగిన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్పొరేషన్లు, పార్టీ కమిటీల్లో మహిళా కాంగ్రెస్ నేతలకు అవకాశం కల్పించాలని, పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు మహిళా డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు నేతలు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసినట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : టీపీసీసీ కూర్పుపై పార్టీ అధిష్ఠానం పెద్దలతో చర్చించేందకు ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ బుధవారం సాయంత్రం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యా రు. అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో సమావేశమై టీపీసీసీ పదవులపై చర్చించారు. అనంతరం పార్టీ ఇన్చార్జితో కలిసి వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ లో టీపీసీసీ కూర్పుతోపాటు అనుబంధ కమిటీలకు ఆమోదం పొందే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.