బోధన్, జూన్ 7 : తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని మంజీరా నదిలో ఇసుక తవ్వకాల నేపథ్యంలో సరిహద్దు వివాదం నెలకొన్నది. మహారాష్ట్ర ప్రభుత్వం తమ భూభాగంలో ఇసుక తవ్వకాల కోసం ఇటీవల అనుమతులు ఇచ్చింది. దీంతో మంజీరా నదిలో ఇరు రాష్ట్రాల మధ్య అనేక ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల మహరాష్ట్ర క్వారీల నిర్వాహకులు మంజీరా నదిలో తమ భూభాగం దాటి మన రాష్ట్రం వైపు చొచ్చుకువచ్చి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారంటూ తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఇసుక తవ్వకాలతో మరోసారి సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల మంజీరాలో హద్దులను మహారాష్ట్ర కాంట్రాక్టర్లు అతిక్రమిస్తుండడం, తమ భూభాగంలోనే ఇసుక తవ్వకాలు చేపడుతున్నారంటూ మహారాష్ట్ర రెవెన్యూ అధికారులు వాదనకు దిగుతుండడంతో ఇరు రాష్ర్టాల మధ్య హద్దుల పంచాయితీ ఏర్పడింది. గతంలో మహారాష్ట్ర క్వారీల నిర్వాహకులు మంజీరా నదిలో మన భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుక తవ్వకాలు జరిపిన ఘటనలే ఇందుకు కారణం. నిజామాబాద్ జిల్లాలోని పొతంగల్, సాలూరా మండలాలలు, మహారాష్ట్రకు మధ్యన మంజీరా నది ఉంది.
ఈ నదిలో ఇటూ తెలంగాణ ప్రభుత్వం, అటు మహారాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాల కోసం ఏటా తవ్వకాల కోసం క్వారీలకు అనుమతులు ఇస్తుంటాయి. మహారాష్ట్ర సర్కార్ చాలా ఏండ్ల తర్వాత తమ భూభాగంలోని మంజీరా నదిలో ఇసుక తవ్వకాల కోసం టెండర్లు ఆహ్వానించడం, టెండర్ల ఖరారు తర్వాత క్వారీలను ఏర్పాటు చేశారు. మంజీరా నదిలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి, దెగ్లూర్ తాలూకాల్లోని హనుగుందా, మాచునూర్, గంజ్గావ్, కార్లా, ఏస్గీ, బోలేగావ్, సగ్రోలి, సావ్లా, షెలాగావ్.. ఇలా అనేక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల కోసం 37 పాయింట్లను గుర్తించి క్వారీలకు అనుమతులు ఇచ్చింది.
ఇరు రాష్ర్టాల అధికారులు కలిసి మంజీరా నదిలో ఎవరి హద్దు ఎంత ఉందో నిర్ధారించేందుకు జాయింట్ సర్వే చేద్దామంటూ మన రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు.
ఇందుకు ఈ నెల 5న (శుక్రవారం)జాయింట్ సర్వే నిర్వహించేందుకు ఇరు రాష్ర్టాల అధికారులు ఒక అంగీకరానికి వచ్చారు. దీని ప్రకారం మన రెవెన్యూ అధికారులు మంజీరా నదిలో వివాదాస్పద స్థలానికి పోలీస్ సిబ్బందితో కలిసి చేరుకున్నారు. తాము నిర్దేశిత స్థలంలో ఉన్నామని, జాయింట్ సర్వేకు రావాల్సిందిగా పలుమార్లు మన అధికారులు అక్కడి అధికారులకు ఫోన్లు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహారాష్ట్ర అధికారులు ‘ఇదిగో వస్తాం.. అదిగో వస్తాం’ అంటూ కాలయాపన చేసి, తీరా సాయంత్రమయ్యేసరికి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. ఇలా జాయింట్ సర్వేకు వారు డుమ్మా కొట్టారు. దీంతో మన రికార్డుల ప్రకారం మంజీరా నదిలో మన హద్దులను చూపిస్తూ ఎర్రజెండాలను సాలూరా మండలం రెవెన్యూ అధికారులు పాతి వెనుదిరిగారు. 2012లో ఒకసారి ఇదే విధంగా సరిహద్దు వివాదం రాజుకోగా, అప్పట్లో జాయింట్ సర్వే కోసం ప్రయత్నాలు జరిగాయి.
అప్పటి జిల్లా జాయింట్ కలెక్టర్, నాందేడ్ జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో మంజీరాలో సర్వే ప్రారంభించగా, సరైన రికార్డులు చూపకుండా మహారాష్ట్ర అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు మహారాష్ట్ర సర్కార్ చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. మంజీరా నదిలో మళ్లీ ఇసుక మాఫియా పేట్రేగిపోకుండా మన అధికారులు శాశ్వత ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇటు మన రాష్ట్రంలోని మంజీరా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నవారిని అదుపులో ఉంచడంతోపాటు అటు మహారాష్ట్ర క్వారీల నిర్వాహకులు మన భూభాగంలోకి చొచ్చుకురాకుండా చూడాలి. మంజీరా గర్భంలో ఇసుకాసురులు అడ్డగోలు తవ్వకాలు చేపడుతున్న తీరుతోనే సరిహద్దుల గ్రామాల్లోని ప్రజల మధ్య తగాదాలు ఏర్పడుతున్నాయి. గతంలో చోటుచేసుకున్న ఘటనలు మళ్లీ చోటుచేసుకోకుండా మన అధికార యంత్రాంగం చొరవ చూపాలి. అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తతో ఉంటేనే మంజీరాను కాపాడుకోగలం.
గతంలో అనేకసార్లు తెలంగాణలోని మంజీరా నదిలో అక్రమంగా ఇసుకను దోచేసిన చరిత్ర మహారాష్ట్ర క్వారీలకు ఉన్నది. మహారాష్ట్ర వైపు తమ భూభాగంలో ఇసుక తవ్వకాలు చేపడుతూ మన భూభాగంలోకి చొరబడడం, పర్యావరణానికి హాని కలిగించేలా ఇసుకను లోతు గా తవ్వి తరలించుకుని పోవడం కోకోల్ల లు. ఈసారి కూడా అదే జరుగుతుందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు నిదర్శనం మన భూభాగంలో మంజీరా నదిలో ఇసుక తవ్వకాలతో ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలు. నెలరోజుల క్రితం మహారాష్ట్రలోని బోలేగావ్ క్వారీ నిర్వాహకులు మంజీరా నదిలో హద్దులు దాటి మన భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని సాలూరా మండలం హూన్సా గ్రామస్తులు ఆందోళన చేపట్టడం సరిహద్దులో ఉద్రిక్తత ఏర్పడింది.
దీంతో సాలూరా రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లాల్సివచ్చింది. ఉద్రికత్త ఏర్పడడంతో రెండు రాష్ర్ర్టాల పోలీసులు అక్కడ మొహరించారు. చివరికి, మన సరిహద్దులోకి ఇసుక తవ్వకాల కోసం చొచ్చుకురాలేదని నిర్ధారించారు. అప్పట్లో టీ కప్పులో తుపాన్‌లా సమస్య సమసిపోయినప్పటికీ, వారం రోజులుగా మళ్లీ ఈ వివాదం రాజుకుంటున్నది. వారం రోజుల క్రితం మహారాష్ట్ర సర్కార్ క్వారీల నిర్వాహకులు మన భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుకను కొల్లగొడుతున్నారంటూ సరిహద్దు గ్రామాల ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర రెవెన్యూ అధికారులకు, మన అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.