హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సమాన అవకాశాలను పొందుతున్నారు. అభివృద్ధిలో ఎంతో ముందుకు సాగుతున్నారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు వివాహితలైన మహిళలు ఉద్యోగ భారంతోపాటు ఇంట్లో పనుల భారాన్ని కూడా మోయాల్సి వస్తున్నది. ఉదయం పడకమీద నుంచి లేచింది మొదలు రాత్రి మళ్లీ పడక ఎక్కేంత వరకూ కుటుంబ సభ్యుల కోసం వారు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు.
వంట పని నుంచి.. పిల్లలు, వృద్ధుల సంరక్షణ బాధ్యత కూడా వారిపైనే పడుతున్నది. ఇందుకోసం ఒక్కో మహిళ సగటున రోజుకు 7.2 గంటలు శ్రమిస్తున్నట్టు ఇటీవల ‘ఏ టూల్ ఫర్ జెండర్డ్ పాలసీ అనాలిసిస్’ పేరిట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్‌కు చెందిన ఓ ప్రొఫెసర్ పరిశోధనా పత్రం వెలువరించారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్) నిర్వహించిన టైమ్ యూజ్ సర్వే (టీయూఎస్) రిపోర్టును ఆధారంగా చేసుకొని ఈ నివేదికను రూపొందించారు.
వేతనాలు పొందే పురుషుల కంటే ఎలాంటి వేతనాలు పొందకుండానే గృహిణులు ఇంటి పనికి రెండింతలు ఎకువ సమయాన్ని వెచ్చిస్తున్నారని ఆ రిపోర్టు తెలియజేసింది. ఇక ఉద్యోగాలు చేసే మహిళలకు ఆ పనిగంటలు అదనం. సాధారణ గృహిణులు 15 నుంచి 60 ఏండ్ల మధ్యనున్న వారు ప్రతిరోజు 7.2 గంటలు ఇంటి పనికోసం శ్రమిస్తున్నారని పేర్కొన్నది. ఇంటి పనిలో పురుషులు కేవలం 2.8 గంటలు మాత్రమే సహాయం చేస్తున్నారని తెలిపింది. విద్యుత్తు, వంటగ్యాస్, కొన్ని ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ పరికరాలు మహిళలపై కొంత భారాన్ని తగ్గిస్తున్నా అది స్వల్పమేనని పేర్కొంది. ఇంటిపని కోసం ఆధునిక పరికరాలు ఉపయోగించే మహిళలు ఇతరుల కంటే 41 నుంచి 80 నిమిషాలు ఎక్కువ విశ్రాంతి పొందుతున్నారని ఆ నివేదిక తెలిపింది. మహిళలపై ఇంటి పనిభారం తగ్గించే దిశగా ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరముందని ఆ నివేదిక నొక్కిచెప్పింది.