పర్వతగిరి, డిసెంబర్ 3: ఇతర కులస్థుడిని ప్రేమించిందని ఓ తల్లి కన్న కూతురిని పొట్టబెట్టుకున్నది. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో చోటుచేసుకున్నది. శుక్రవారం పర్వతగిరి పోలీస్‌స్టేషన్‌లో ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటలక్ష్మి వెల్లడించిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఉబ్బని సమ్మక్క, బాబు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. 17 ఏండ్ల క్రితం బాబు అనారోగ్యంతో మృతిచెందాడు. పెద్ద కుమార్తెకు పెండ్లి చేయగా, చిన్నకుమార్తెను స్థానిక పాఠశాలలో పదోతరగతి చదివిస్తున్నది. ఈ క్రమంలో చిన్న కుమార్తె (17) అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. విషయం ఆమె తల్లి సమ్మక్కకు తెలియడంతో పలుమార్లు కుమార్తెను మందలించింది. అయినా ఆమెలో ఎలాంటి మా ర్పు రాలేదు. తమ కుటుంబ పరువు తీస్తున్నదని భావించిన సమ్మక్క తన తల్లి యాకమ్మతో కలిసి చిన్న కుమార్తెను హత్యచేసింది. పెండ్లికి అంగీకరించలేదని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్టు చుట్టుపక్కల వారిని నమ్మించారు. పోలీసుల దర్యాప్తులో ఆ బాలికది హత్య అని తేలింది. సమ్మక్క గొంతు నులుమగా, యాకమ్మ ముఖంపై దిండుతో అదిమిపట్టి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇతర కులానికి చెందిన వాడిని ప్రేమించడం తట్టుకోలేక చిన్న కూతురిని హత్య చేసినట్టు సమ్మక్క చెప్పడంతో ఆ ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీసీపీ వెంకటలక్ష్మి చెప్పారు.