గద్వాల అర్బన్, జూన్ 22: ‘ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య’, ‘హనీమూన్‌కు తీసుకెళ్లి లవర్‌తో కలిసి భర్తను మర్డర్ చేయించిన నవవధువు’… ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలుస్తున్న ఈ తరహా ఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్‌కు చెందిన రాజారఘువంశీ, సోనమ్ దంపతులు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లగా.. అక్కడే ప్రి యుడితో భర్తను చంపించిన సంచలన ఘటన యావత్ దేశాన్ని నివ్వెరపర్చింది. ఇప్పుడు అలాంటి ఘటననే గద్వాల జిల్లాలో జరిగింది. ప్రియుడు, తల్లితో కలిసి భర్తను చంపించిన భార్య ఉదంతంలో పోలీసులు కేసు నమోదు చేశారు. హంతకులను, తల్లీకూతుళ్లను అరెస్ట్ చేశారు. ప్రియుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు.
పోలీసులవర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గంటరేగికి చెందిన తేజేశ్వర్ (32) ప్రైవేటు సర్వేయర్‌గా పనిచేసేవాడు. అతడికి ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన ఐశ్వర్యతో ఫిబ్రవరి 13న పెండ్లి నిశ్చయమైంది. మే 18న పెండ్లి జరగాల్సి ఉండగా ఐదు రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. ఈ విషయపై యువతిని తేజేశ్వర్‌ను ప్రశ్నించగా కట్నం డబ్బుల కోసం తన తల్లి పడుతున్న ఇబ్బందులు చూడలేక బాధతో స్నేహితురాలి ఇంటికి వెళ్లినట్టు చెప్పింది. దీంతో తల్లిదండ్రులను ఒప్పించిన తేజేశ్వర్ ముందే నిశ్చయించిన ప్రకారం మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు.
అసలేమైందంటే!
కర్నూల్ జిల్లా కల్లూరు ఎస్టేట్‌కు చెందిన సుజాత.. ఓ బ్యాంకులో స్వీపర్‌గా పనిచేస్తున్నది. ఆమెకు బ్యాంకు మేనేజర్ తిరుమల్‌రావుతో వివాహేతర సంబంధం ఉంది. సుజాత కూతురు ఐశ్వర్యతోనూ తిరుమల్‌రావు సంబంధం పెట్టుకున్నాడు. ఐశ్వర్యను రెండోపెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ తిరుమల్‌రావు భార్య ఒప్పుకోలేదు. దీంతో తేజేశ్వర్‌ను పెళ్లి చేసుకున్న ఐశ్వర్య… పెండ్లయిన తర్వాత కూడా తిరుమల్‌రావుతో నెలలోపే 2000 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. తేజేశ్వర్‌ను హత్య చేయాలన్న ఐశ్వర్య నిర్ణయించుకుందని, ఈ విషయాన్ని తల్లి సుజాతతో చెప్పగా, ఆమె తిరుమల్‌రావు దృష్టికి తీసుకెళ్లింది. ఈక్రమంలోనే సుపారీ ఇచ్చిమరీ.. తేజేశ్వర్‌ను హత్య చేయించి కర్నూల్ జిల్లాలోని పిన్నాపురం చెరువులో పడేశారు. హత్యకు పాల్పడిన ముగ్గురితోపాటు ఐశ్వర్య ఆమె తల్లి సుజాతను అరెస్టు చేయగా, తిరుమల్‌రావు పరారీలో ఉన్నాడు.