వర్ని, ఏప్రిల్ 28 : తనతో మాట్లాడడం లేదని ఆగ్రహానికి లోనైన ఓ వ్యక్తి.. మహిళను దారుణంగా హతమార్చాడు. కోపోద్రిక్తులైన మృతురాలి సంబంధీకులు అతడిపై దాడి చేయడంతో నిందితుడు సైతం మృత్యువాత పడ్డాడు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో చోటుచేసుకున్న ఈ ఘ టన స్థానికంగా కలకలం రేపింది. పోలీసు ల వివరాల మేరకు.. వర్ని మండలం పొట్టిగుట్ట తండాకు చెందిన పాత్లొత్ కవిత (35) భర్త పదేండ్ల క్రితం చనిపోగా, పుట్టింటి వద్దే ఉంటున్నది. ఈ క్రమంలో మేడిపల్లి తండాకు చెందిన ఆనంద్ (40)తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
కొంతకాలంగా కవిత అతడితో మాట్లాడటంలేదు. దీంతో ఆనంద్ మంగళవారం.. కవిత నిర్మించుకుంటున్న ఇంటి వద్దకు వెళ్లాడు. అక్కడే ఉన్న ఆమె తలపై పారతోగట్టిగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కవిత బంధువులు పారిపోతున్న నిందితుడిని వెంబడించి దాడిచేశారు. పోలీసులు ఆనంద్‌ను నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనా స్థలా న్ని ఏసీపీ శ్రీనివాస్, సీఐ కృష్ణ, ఎస్సైలు రాజు, భాస్కరాచారి పరిశీలించారు.