హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం జరిగిందన్న కేసు కీలక మలుపు తిరిగింది. మార్చి 22న రాత్రి ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు జరిపిన పోలీసులు సంచలన నిర్ధారణకు వచ్చారు. సదరు యువతిపై అత్యాచారయత్నం జరగలేదని, ఆ యువతి పోలీసులను తప్పుదోవ పట్టించిందని తేల్చారు. కానీ తనపై అత్యాచారయత్నం జరిగిందని సదరు యువతి చెప్తుండటంతో కేసుపై సందిగ్ధత నెలకొంది.
అనంతపురం జిల్లాకు చెందిన యువతి సిటీలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నది. మార్చి 22న సికింద్రాబాద్లో సెల్ఫోన్ రిపేర్ చేయించుకుని, మేడ్చల్లోని ఇంటికి తిరిగి వెళ్లేందుకు సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్లో రైలు ఎక్కింది. అయితే కొంపల్లి సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద గాయపడిన స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు ముందుగా గాంధీ దవాఖానకు, ఆ తర్వాత ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న యువతిని రైల్వే పోలీసులు విచారించగా ఆమెపై అత్యాచారయత్నం జరిగిందని తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. యువతి చెప్తున్నట్టుగా రైలులో అత్యాచారయత్నం జరగలేదని పోలీసులు నిర్ధారించారు.
పోలీసులు చేస్తున్న ఆరోపణలు వాస్తవంకాదు. నేను పోలీసులను తప్పుదోవ పట్టించడంలేదు. నాపై అత్యాచారయత్నం జరిగింది. ఆ రోజు రైలు బోగీలో నేను, మరో యువకుడు మాత్రమే ఉన్నాం. అల్వాల్ దాటిన తర్వాత బోగీలో ఉన్న వ్యక్తి నా దగ్గరకు వచ్చి, శారీరకం సంబంధం కోసం అడిగాడు. నేను ఒప్పుకోకపోవడంతో లైంగికదాడికి ప్రయత్నించాడు. అతడి నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో నాకు కొంత సమయం కావాలని చెప్పాను. ఆ తర్వాత డోర్ దగ్గర నిలబడి, కిందకు దూకాను. దవాఖానలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా పోలీసుల దర్యాప్తులో నిందితుడిని గుర్తుపట్టాను.
ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం జరగలేదు. పోలీసులను సదరు యువతి తప్పుదోవ పట్టించింది. ప్రమాదానికి గురైన సమయంలో ఒక ఫోన్లో రీల్స్ చేస్తూ మరో ఫోన్లో మాట్లాడుతూనే ఉందని దర్యాప్తులో తేలింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత యువతి పోలీసులను తప్పుదోవ పట్టించినట్టుగా తేలింది. ఎవరినీ అన్యాయంగా కేసులో ఇరికించవద్దని న్యాయనిపుణులు సలహా ఇచ్చారు. కేసు క్లోజ్ చేసే అంశంపై ఆలోచిస్తున్నాం. -చందనాదీప్తి, రైల్వే ఎస్పీ