షాబాద్, జూన్ 26: ఉద్యోగం పో వడం, భర్త విడాకులు ఇవ్వడం వంటి సమస్యలతో మనస్తాపానికి గురైన ఓ యువతి రైల్వేట్రాక్‌పై కారు నడిపి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. రైల్వేపోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చెందిన వోమికా సోనీ(34) 2019 నుంచి హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో ఉంటున్నది.
క్యాప్‌జెమినీ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే ఆమెకు పెళ్లి జరిగిన కొన్ని రోజులకే భర్త విడాకులు ఇచ్చాడు. మానసిక ఒత్తిడికి గురైన యువతికి మూడు నెలల క్రితం ఉద్యోగం పోయింది. నెలకు రూ.లక్షన్నర జీతం వచ్చేది. ఉద్యోగం పోయినప్పటి నుంచి అద్దె ఇంట్లో ఒంటరిగా ఉండేది. దీంతో తీవ్రమానసిక ఒత్తిడికి గురై గురువారం తన కారులో కొండకల్‌కు వచ్చింది.
రైల్వే ట్రాక్ వైపు కారు మలుపుకుని పట్టాలపై శంకర్పల్లి వైపు ప్రయాణించింది. సుమారు 7 కిలోమీటర్లు పట్టాలపై ప్రయాణం చేస్తుండగా గమనించిన కొండకల్ రైల్వే ఉద్యోగి స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించారు. దీంతో రైళ్ల రాకపోకలు రెండు గంటలు నిలిచిపోయాయి. శంకర్పల్లి, వికారాబాద్ రైల్వే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రైల్వేపట్టాలను క్రాస్ చేయడంతో కారు ముందుకు పోకుండా ఆగిపోయింది.
అయినా కారులో నుంచి ఆమె దిగకపోవడంతో అద్దాలను పగులగొట్టి యువతిని అదుపులోకి తీసుకుని శంకర్పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ నుంచి108 అంబులెన్స్‌లో చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తీసుకువెళ్లారు. తన ఉద్యోగం పోవడం, భర్త విడాకులు వంటి కారణాలతో యువతీ ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిందని విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు. విధులకు ఆటంకం కలిగించినందుకు యువతిపై కేసు నమోదు చేసినట్టు శంకర్పల్లి పోలీసులు తెలిపారు.