పుల్కల్, మే 19: తెల్లారితే ఆ ఇంట్లో పెండ్లి భాజాలు మోగాల్సి ఉంది. కానీ.. విధి వక్రీకరించి చావు డప్పు మోగింది. ఇంట్లో విద్యుత్తు షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాదకర ఘటన ఆదివారం సంగారెడ్డి జిల్లా పుల్కల్లో చోటుచేసుకుంది. పుల్కల్కు చెందిన మ్యాతరి గంగమ్మ (41) చెల్లెలి కూతురు దివ్య వివాహం సోమవారం మెదక్లో జరగాల్సి ఉంది.
కుటుంబసభ్యులు అందరూ పెండ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో ఇంటి ముందర గోడపై ఉన్న మీటరు వైరుకు చేయి తాకడంతో ఆమెకు కరెంటు షాక్ తగిలింది. దీంతో గంగమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. గంగమ్మ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పుల్కల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గంగమ్మ మృతదేహానికి పంచనామా నిర్వహించి.. పోస్ట్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలి కూతురు నందిని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై వెంకటేశం తెలిపారు.