వేమనపల్లి, నవంబర్ 17 : ఓ మహిళ బైక్‌పై వస్తుండగా, చీర కొంగు టైర్లలో ఇరుక్కొని కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. గతంలో భర్త కరోనాతో చనిపోగా, ప్రస్తుతం ఈమె రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం లింగాలకు చెందిన మద్దెర్ల వెంకన్న-పుష్పలత దంపతులకు కుమారులు నిహాల్ , రిషిత్, కూతురు సహస్ర ఉన్నారు. వేమనపల్లి మండల కేంద్రంలో కిరాణాషాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తుండగా, 2021లో కరోనాతో వెంకన్న మృతి చెందాడు. నిహాల్ ఇంటర్ చదువుతున్నాడు. రిషిత్ వరంగల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.
ఇటీవల ఇంటికి వచ్చిన బాలుడిని ఆదివారం హాస్టల్లో దింపి వచ్చేందుకు పుష్పలత వెళ్లింది. తిరుగు ప్రయాణంలో వరంగల్ నుంచి గోదావరిఖని వరకు బస్సులో వచ్చింది. ఈ క్రమంలో రాత్రి గోదావరిఖనిలో తన బంధువు బైక్ ఎక్కింది. గోదావరి నది వంతెన సమీపంలోకి రాగానే పుష్పలత చీరకొంగు బైక్ టైర్లలో ఇరుక్కోగా కింద పడి డివైడర్ పోల్స్‌కు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె మృతదేహన్ని గోదావరిఖనిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సోమవారం ఉదయం వేమనపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. కుమారులు తల్లి పాడెను మోయడం అక్కడున్న వారిని కలిచివేసింది.