ఓదెల, నవంబర్ 9: కోతులు వీరంగం సృష్టించడంతో ఓ నిండు ప్రాణం బలైంది. భవనం పైకప్పును ఊపడంతో రేకులు కూలి మీద పడటంతో ఓ మహిళ మృతిచెందింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్‌లో విషాదాన్ని నింపింది. పోలీసులు, గ్రామస్థు లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అంతగిరి రాజేశ్వరి(65) సాయం త్రం పూట తన ఇంటి పక్కన ఒంటరిగా ఉండే ఐలమ్మ ఇంటికి కొద్దిసేపు కాలక్షేపం కోసమని వెళ్లింది.
ఐలమ్మ చాయ్ పెట్టడానికి ఇంట్లోకి వెళ్లిన సమయంలో ఇంటి ముందు రేకుల కింద కూర్చున్న రాజేశ్వరి మీద ఒక్కసారి గా పైకప్పు సిమెంట్ రాడ్లు సజ్జతోపాటు దానికి అంటుకుని ఉన్న రేకులు కుప్పకూలాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ భవనం పాతది కావడం.. అప్పటిదాక రేకుల పైన కోతులు కూర్చుని ఊపినట్టు స్థానికులు తెలిపారు. మృతురాలు నిరుపేద కావడంతో పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేశ్‌గౌడ్ ఆమె కుటుంబానికి సాయం అందించి ఉదారత చాటుకున్నారు. మృతురాలి భర్త లక్ష్మయ్య పదేళ్ల క్రితమే మరణించాడు. ఆమెకు కూతురు, ఇద్దరు కొడుకులు ఉండగా ఓ కొడుకు ఏడాది కిందటే మృతి చెందాడు.