కరీమాబాద్, డిసెంబర్ 25: మూర్ఛ జబ్బుకు అల్లోపతి అవసరం లేదని, హెర్బల్ మందు చాలని చెప్పడంతో నమ్మిన ఓ మహిళ ప్రాణాపాయస్థితిలోకి వెళ్లింది. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోజెరువుకు చెందిన యాదలక్ష్మి కొంతకాలంగా మూర్ఛవ్యాధితో బాధపడుతున్నది. డాక్టర్ల సలహాలు, సూచనలతో అల్లోపతి వైద్యం తీసుకుంటున్నది. ఈ నెల 16న ఓ మహిళ యాదలక్ష్మి ఇంటికి వచ్చి మూర్ఛ వ్యాధికి హెర్బల్ మందు వాడితే 15 రోజుల్లో పూర్తిగా నయమవుతుందని తెలిపింది. మహిళ మాటలను నమ్మిన యాదలక్ష్మి హెర్బల్ మందులను వాడుతూ ఈ నెల 19న ఇంటిలో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఎంజీఎం దవాఖానకు తరలించగా హెర్బల్ మందు విషయం వెలుగులోకి వచ్చింది. బంధువులు ఈ విషయాన్ని తెలంగాణ వైద్య మండలి పబ్లిక్ రిలేషన్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు. వారు యాదలక్ష్మితో మా ట్లాడి వివరాలు తెలుసుకుని, హెర్బల్ మం దులు వాడడం వల్ల కిడ్నీ, లివర్ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. సదరు మహిళ కవితపై చెన్నారావుపేట పోలీసులకు బాధిత మహిళ బంధువులు, డాక్టర్లు ఫిర్యాదు చేశారు.