హైదరాబాద్, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ): ఇటీవల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కంబోడియా సైబర్‌క్రైమ్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ముంబైలోని చెంబూర్‌లో ప్రియాంక శివకుమార్ సిద్దూను అదుపులోకి తీసుకున్నట్టు సైబర్ డీజీ శిఖాగోయెల్ శుక్రవారం తెలిపారు. ముంబైలోని మ్యాక్స్‌వెల్ విదేశీ జాబ్ ప్రాసెసింగ్ కంపెనీలో ప్రియాంక పనిచేసేది. కొన్ని కారణాలతో ఆ కంపెనీ మూతపడగా ప్రియాంక లైసెన్స్లేకుండానే సొంత ఏజెన్సీని ఏర్పాటు చేసుకుని, ఇదే తరహాలో ముంబైలో ఏజెన్సీ నిర్వహిస్తున్న నారాయణతో పరిచయం పెంచుకుంది. నారాయణ కంబోడియాకు వెళ్లి డాటా ఎంట్రీ జాబ్స్ గురించి ప్రియాంకకు తెలియజేసేవాడు. ఝూన్ జీ అనే చైనీస్ కంపెనీ డైరెక్టర్ జితేందర్ షా అలియాస్ అమీర్‌ఖాన్‌తో పరిచయం చేసుకుంది. కాల్ సెంటర్‌కు ఎవరినైనా పంపితే ఒక్కో వ్యక్తికి 500 డాలర్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన వంశీకృష్ణ, సాయిప్రసాద్ నుంచి రూ.30వేల చొప్పున కమీషన్ తీసుకొని కంబోడియా పంపింది. వారు అక్కడ సైబర్ క్రిమినల్స్ చేతిలో చిత్రహింసలు అనుభవించి ఇటీవల భారత్‌కు వచ్చారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఎస్బీ ముంబై వెళ్లి ప్రియాంకను అరెస్టు చేసింది.
ప్రజావాణికి 576 దరఖాస్తులు
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 576 దరఖాస్తులు వచ్చాయి. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి 214, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 78, విద్యుత్ శాఖకు సంబంధించి 56, మైనారిటీ వెల్ఫేర్‌కు సంబంధించి 44, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 44, ఇతర శాఖలకు సంబంధించి 140 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.