SSC Exam Paper Leak | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): పదవ తరగతి తెలుగు పేపర్ లీక్ చేసిన కేసులో నిందితుడైన సంబుర్ బందెప్పకు బీజేపీ నాయకులతో సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే బందెప్పను పావుగా వాడుకున్నట్టు భావిస్తున్నారు. బందెప్ప గత చరిత్ర చూసినా ఇదే విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా బందెప్పపై గతంలో పోక్సో చట్టం కింద కేసు నమోదు కావటం గమనార్హం. తాండూరు పట్టణం నంబర్-1 ఉన్నత పాఠశాలలో బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బందెప్ప ఆది నుంచి వివాదాస్పదుడే. 2015-16 ప్రాంతంలో ఇదే పాఠశాలలో ఓపెన్ ఇంటర్ పరీక్షల సమయంలో బందెప్ప ఇన్విజిలేటర్‌గా వ్యవహరించాడు.
ఆ సమయంలోనూ అక్రమాలకు పాల్పడినట్టుగా తేలడంతో బందెప్పను ఇన్విజిలేటర్ విధు ల నుంచి తొలగించారు. 2017లోనూ మరో వ్యవహారంలో బందెప్పపై కేసు నమోదైంది. ఇదే పాఠశాలలో ఒక విద్యార్థిని వేధించిన వ్యవహారంలో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇలాంటి చరిత్ర ఉన్న బందెప్ప అయితే సులువుగా తమ దారిలోకి వస్తాడని భావించిన బీజేపీ నాయకులు కొందరు అధిష్ఠానం ఆదేశంతో రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఎలాగైనా ప్రశ్నాపత్రాన్ని సామాజిక మాద్యమాల ద్వారా బయటికి తీసుకువస్తే, వెంటనే దానిని లీకేజీగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్నది బీజేపీ కుట్ర. తద్వారా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేయాలనుకున్నది. ఈ మేరకు ప్రశ్నపత్రాలను తెలివిగా ఫొటోలు తీసి బయటికి పంపించడంలో మొదటి నుంచి ప్రావీణ్యం ఉన్న బందెప్పతో కుట్రను విజయవంతంగా అమలు చేయొచ్చని స్కెచ్ వేశారు. తాండూరు పట్టణం నంబర్-1 ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో రిలీవర్‌గా ఉన్న బందెప్ప గైర్హాజరు అయిన విద్యార్థికి సంబంధించిన ప్రశ్నపత్రాన్ని ఫోన్ ద్వారా ఫొటో తీసి.. వాట్సప్‌లో తన మిత్రుడు సమ్మప్పకు పంపాడు. సమ్మప్ప దానిని గ్రూపులో వేశాడు. వెంటనే బీజేపీ సోషల్ మీడియా, ఆ పార్టీ నాయకులు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున దానిని సామాజిక మాధ్యమాల్లో తిప్పారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ ప్రచారం చేశారు. ఇలా బీజేపీ రాజకీయంగా బీఆర్ఎస్ను ఎదుర్కోలేక… ఒక పన్నాగం ప్రకారం పదో తరగతి పరీక్షలు మొదలైన రోజు నుంచే కుట్రలకు తెరలేపింది.