భిక్కనూరు, జూన్ 24 : ముందస్తు వానలు మురిపించడంతో అన్నదాతలు ఆనందంతో విత్తనాలు వేశారు. విత్తు మొలకెత్తడంతో మురిసిపోయారు. కానీ రెండు వారాలుగా చినుకు జాడ కరువైంది. నీళ్లు లేక మొక్క దశలోనే పంట ఎండుతున్నది. వరుణుడు ముఖం చాటేయడంతో రైతు ముఖం వాడిపోతున్నది. వేలాది ఎకరాల్లో రూ.లక్షల పెట్టుబడి పెట్టిన రైతాంగం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నది. వాడిపోతున్న మొక్కలను రక్షించుకునేందుకు కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి రైతు ఆముదాల రమేశ్ భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు.
మక్కజొన్న పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చి కుటుంబ సభ్యులు, కూలీలను పెట్టి చెంబులతో మొక్కలకు నీళ్లు పోయిస్తున్నాడు. ఐదున్నర ఎకరాలు కౌలుకు తీసుకున్న రమేశ్ మక్కజొన్న పంట వేశాడు. ఇప్పటికే భారీగా పెట్టుబడి పెట్టిన ఆయన.. 20 రోజులుగా వానలు లేకపోవడంతో పంటను కాపాడుకునేందుకు మరింత ఖర్చు చేయాల్సి వస్తున్నదని వాపోయాడు.