హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలవడంతో కార్మికవర్గానికి భవిష్యత్తులో మరిన్ని కష్టాలు వస్తాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కార్మికవర్గం పటిష్టంగా ఉండి పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపిచ్చారు. శుక్రవారం ఏఐటీయూసీ అనుబంధ సంఘాల సమావేశాన్ని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని కోరారు. ఎన్నికలకు ముందు బీహార్‌లో 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో ప్రభుత్వం రూ.10వేల చొప్పున బదిలీ చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని మండిపడ్డారు. సర్ పేరిట 65లక్షల ఓట్లు తొలగించారని గుర్తుచేశారు. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా మారిందని ఆరోపించారు.