హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘పార్టీ మారి తప్పు చేశామా?’- ఇదీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల్లో మొదలైన అంతర్మథనం. ‘నిన్నమొన్నటిదాకా ఏం కాదులే అనుకున్నాం. కానీ, హైకోర్టు తీర్పుతో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏంచేయాలో అర్థం కావడం లేదు. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టే ఉన్నది’ అని పార్టీ మారిన ఎమ్మెల్యే ఒకరు తన సన్నిహితులతో వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదని, ఆ పార్టీ శ్రేణులు సహకరించడం లేదని, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరగుతున్నదని ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తే తట్టుకొని నిలబడటం కష్టమని సదరు ఎమ్మెల్యే మథనపడుతున్నారని ఆయన అనుచరులు బాహాటంగానే చెప్తున్నారు. గద్వాల, భద్రాచలం, స్టేషన్‌ఘన్‌పూర్, జగిత్యాల, బాన్సువాడ, చేవెళ్ల, పటాన్చెరు, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, రాజేంద్రనగర్ ఈ పది నియోజకవర్గాల్లో హైకోర్టు తీర్పు హాట్‌టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏదో గాలి వీచింది కానీ, ఇప్పుడా పరిస్థితి లేదని పార్టీ మారిన ఎమ్మెల్యేలు బలంగా నమ్ముతున్నట్టు సమాచారం. కోర్టు తీర్పు అనంతరం ఫుల్‌బెంచ్‌కు వెళ్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొనడం, తానింకా బీఆర్ఎస్లోనే ఉన్నానని పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) చైర్మన్‌గా నియమితులైన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వ్యాఖ్యానించడానికి అంతర్మథనమే కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
సర్కార్‌పై వ్యతిరేకత.. కాంగ్రెస్‌లో తిరుగుబాటు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్న అసంతృప్తి వివిధ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. రుణమాఫీ విషయంలో రైతుల నిరసనలు చేయని నియోజకవర్గమే లేదు. వానకాలం సీజన్ ముగింపు దశకు వచ్చినా రైతుభరోసాపై స్పష్టత రాలేదు. మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు ఆసరా పింఛన్ల పెంపుతోపాటు ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కదానినీ సంపూర్ణంగా అమలుచేయకపోవడం వివిధ వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతున్నదని పార్టీ మారిన ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. దీనికితోడు కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు శరాఘాతంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కొద్దిరోజులకు తత్వం బోధపడిన కొంతమంది ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారికి పదవులు ఆశ చూపారు.
ఈ అంశం కూడా కాంగ్రెస్ పార్టీని అతలాకుతలం చేస్తున్నది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కట్టబెట్టిన పదువులు కాంగ్రెస్ పార్టీలో వర్గపోరును తీవ్రతరం చేశాయి. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, కడియం శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న గద్వాల, జగిత్యాల, స్టేషన్ఘనపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌లో వర్గపోరు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నది. ఒకటి రెండు నియోజకకర్గాలు మినహా పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ క్యాడర్ ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, మరోవైపు కాంగ్రెస్‌లో తిరుగుబాటుతో సతమతం అవుతున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఆ ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా చేసిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై ఉప ఎన్నికల కత్తి వేలాడనున్నది.