Sand Rate Hike | హైదరాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ఇసుక ధరలకు రెక్కలొచ్చాయి. టన్ను ఇసుక ధర మళ్లీ రూ.2,200 నుంచి రూ.2,500 వరకు ఎగబాకింది. గత ఆగస్టులో వర్షాల సందర్భంగా రూ.2,500కు చేరుకున్నప్పటికీ, వర్షాలు తగ్గాక ధరలు రూ.1,500కు దిగివచ్చాయి. ఇప్పుడు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో మళ్లీ రూ.2,200కు చేరింది. కొన్నిచోట్ల రూ.2,500 వరకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ఇసుక రీచ్‌ల నుంచి ప్రతి నెలా 10 నుంచి 15 లక్షల టన్నుల ఇసుకను తవ్వితీస్తారు. వర్షాకాలంలో కొంత తక్కువగా, వేసవిలో కొంత ఎక్కువగా ఇసుకను తీయడం పరిపాటి. ఆగస్టు చివరి వారం నుంచి ఇప్పటివరకు వర్షాల వల్ల రీచ్‌ల వద్ద ఇసుక తీయడం సాధ్యం కాలేదు. దాదాపు వారం రోజులుగా ఇసుక తీయడం నిలిచిపోవడంతో స్టాక్‌యార్డ్‌ల వద్ద కూడా నిల్వలు అడుగంటిపోయాయి. వర్షాల వల్ల కొద్దిరోజులుగా 19 రీచ్‌లు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇటీవలి వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదల కారణంగా అక్కడ కూడా ఇసుక తోడటం నిలిపివేశారు. టెండర్లు ఖరారై ఇసుక తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న మేడిగడ్డ ప్రాంతంలో నీటి ప్రవాహం నిలిచిపోయేవరకు ఇసుక తీయడం సాధ్యంకాదని ఇదివరకే అధికారులు తేల్చారు. ఇటీవల గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతించడం వల్ల మరో 25 రీచ్‌ల్లో ఇసుక తీసుకునే వీలున్నప్పటికీ నీటి ప్రవాహం వల్ల అక్కడ కూడా ప్రస్తుతం సాధ్యం కావడంలేదని అధికారులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి తదితర ప్రాంతాల నుంచి అధికంగా హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇసుక సరఫరా అవుతున్నది. ఈ ప్రాంతాలన్నీ ప్రస్తుత వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతాలుగా మారిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో కూడా కురుస్తున్న అధిక వర్షాల వల్ల నదులకు వరద పోటెత్తడంతో ఇసుక తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 85.62 లక్షల టన్నుల ఇసుక విక్రయాలు జరుగగా, వాటిపై టీజీఎండీసీకి రూ.350.57 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇదే కాలంలో 69.03 లక్షల టన్నుల విక్రయం ద్వారా రూ.280.70 కోట్ల ఆదాయం రావడం విశేషం. గత ఏడాదితో పోల్చుకుంటే సుమారు రూ.70 కోట్ల ఆదాయం అధికంగా వచ్చినట్టయ్యింది.