ఆరోగ్య భగీరథ.. ఇంటింటికీ నల్లా నీళ్లతో రోగాలు దూరం
: మిషన్ భగీరథ పథకం కేవలం ఇంటింటికీ నల్లా నీళ్లు అందించడమే కాకుండా ప్రజారోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నది. సీఎం కేసీఆర్ ‘భగీరథ’ ప్రయత్నంతో ప్రజలకు శుద్ధి చేసిన జలాలు అందడమే కాకుండా కలుషిత నీటి వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు సైతం తగ్గుముఖం పట్టాయి.
- ప్రత్యక్ష ఉదాహరణగా కుమ్రంభీం ఆసిఫాబాద్
- జిల్లాలో 2021 నుంచి ప్రతి ఇంటికీ తాగునీరు
- రెండేండ్లలో దాదాపు కనుమరుగైన డయేరియా
- భారీగా తగ్గిన మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు
మిషన్ భగీరథ పథకం అద్భుతాలు సృష్టిస్తున్నది. ఒకప్పుడు ఎన్నో ప్రాణాలను బలితీసుకున్న సీజనల్ వ్యాధులను తరిమిస్తున్నది. మారుమూల, అటవీప్రాంతాల్లో సైతం ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇందుకు తిరుగులేని సాక్ష్యం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా. అక్కడ డయేరియా, టైఫాయిడ్, మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులు ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయాయి. ఇందుకు ప్రధాన కారణం అపర భగీరథుడు సీఎం కేసీఆర్ ఇంటింటికీ అందిస్తున్న నల్లా నీళ్లే. ఒకనాడు రోగాలతో కునారిల్లిన ప్రాంతాలకు ఇప్పుడు మిషన్ భగీరథ పథకం అమృతధారగా వర్ధిల్లుతున్నది.
హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మిషన్ భగీరథ పథకం కేవలం ఇంటింటికీ నల్లా నీళ్లు అందించడమే కాకుండా ప్రజారోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నది. సీఎం కేసీఆర్ ‘భగీరథ’ ప్రయత్నంతో ప్రజలకు శుద్ధి చేసిన జలాలు అందడమే కాకుండా కలుషిత నీటి వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు సైతం తగ్గుముఖం పట్టాయి. ఇందుకు అటవీప్రాంత జిల్లా కుమ్రంభీం ఆసిఫాబాద్ ప్రత్యక్ష ఉదాహరణ. ఒకప్పుడు వ్యాధులకు కేరాఫ్‌గా నిలిచిన ఈ జిల్లాలో ఇప్పుడు అనారోగ్య సమస్యలు గణనీయంగా తగ్గిపోయాయి. మిషన్ భగీరథ అమలుతోపాటు పంచాయతీరాజ్, వైద్యారోగ్య శాఖల సంయుక్త కృషి ఫలితంగా ‘ఆరోగ్య ఆసిఫాబాద్’గా మారుతున్నది. జిల్లా వైశాల్యం 4,491 చదరపు కిలోమీటర్లలో సగానికిపైగా (55%) అటవీ ప్రాంతమే. జిల్లాలో అత్యధిక జనాభా ఆదివాసీలు, గిరిజనులే. జిల్లాలో 15 మండలాలు, 335 గ్రామ పంచాయతీలు, 1,111 ఆవాసాలు న్నాయి. ఇక్కడ 22 పీహెచ్సీ/యూపీహెచ్‌సీలు సేవలు అందిస్తున్నాయి. జిల్లాలోని ప్రతి ఇంటికీ 2021 నుంచి పూర్తి స్థాయిలో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతున్నది. అప్పటినుంచి వ్యాధుల తగ్గుదలలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. వైద్యారోగ్యశాఖ ఇటీవల రూపొందించిన ప్రత్యేక నివేదిక ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి.
నాడు నీళ్ల గోస.. ఇప్పుడు ఇంటికే నీళ్లు
ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా ప్రజలు తాగునీటి కోసం నానా కష్టాలు పడేవారు. వర్షాధార వ్యవసాయం కావడంతో సాగు భూముల్లో సైతం బోర్లు, బావులు లేవు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు నీళ్ల కోసం సమీపంలోని కుంటలు, చెరువులు, కాలువలపై ఆధారపడాల్సి వచ్చేది. మహిళలు, బాలికలు కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి. నీరు మలినాలతో అపరిశుభ్రంగా ఉన్నా వాటి నే తాగక తప్పని దౌర్భాగ్యం. క్రూర జంతువులకు సైతం అదే ఆధారంగా ఉండేది. దీంతో మనుషులపై దాడులు చేసిన సందర్భాలు ఉండేవి. కలుషిత నీటి ఫలితంగా తరుచూ డయేరియా విజృంభించేది.
- ఆ నీటి వనరుల్లోనే మనుషులు, జంతువులు స్నానాలు చేయడం, కలుషితాలు కలువడం వల్ల క్రిప్టోస్పొరీడియం, ఈ-కొలి వంటి బ్యాక్టీరియాలు, వైరస్లు ఆ నీళ్లలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
- వానకాలం వచ్చిందంటే వర్షపు నీటిని బిందెల్లో, డ్రమ్ముల్లో నింపి పెట్టుకునేవారు. దీంతో దోమలు పుట్టుకొచ్చేవి. మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు విజృంభించేవి. ఫలితంగా ప్రజలంతా మంచం పట్టేవారు.
- వీటన్నింటి ఫలితంగా విష జ్వరాలు, వాంతులు, విరేచనాలు వంటి డయేరియా లక్షణాలతోపాటు చర్మవ్యాధులు, కన్ను, చెవి, ఊపిరితిత్తులు, థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా కనిపించేవి.
పరిష్కారం చూపిన మిషన్ భగీరథ
సీఎం కేసీఆర్ అమలు చేసిన మిషన్ భగీరథ పథకం.. మన్యం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపింది. ప్రస్తుతం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఉన్నది. రోజూ 100 లీటర్ల శుద్ధి చేసిన నీళ్లు వస్తున్నాయి. దీంతో మహిళలు, బాలికలు కిలోమీటర్ల దూరం వెళ్లి, నీళ్ల బిందెలను తలపై ఎత్తుకొని రావాల్సిన శ్రమ తగ్గింది.
40% తగ్గిన టైఫాయిడ్ బాధితులు
రోజూ తాగునీరు వస్తుండటంతో ఇండ్లల్లో నీళ్లను నిల్వ చేసుకోవాల్సిన అవసరం తప్పింది. ఫలితంగా దోమల సంఖ్య అదుపులోకి వచ్చింది. వాటి ద్వారా సంక్రమించే మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు భారీగా తగ్గాయి. ఒకప్పుడు ‘మంచం పట్టిన మన్యం’, ‘మన్యంలో విషజ్వరాలు’ అంటూ మీడియాలో వార్తలు కనిపించేవి. కానీ.. మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, ఆరోగ్యశాఖలు తీసుకున్న చర్యల ఫలితంగా 2021 నుంచి మార్పు కనిపించింది. టైఫాయిడ్ కేసులు 2020లో 4,891 నమోదు కాగా.. 2021లో 40% తగ్గి 2,895 కేసులే బయటపడ్డాయి. 2022 నాటి కి మరింత తగ్గి.. 1,845 కేసులు మాత్రమే వెలుగు చూశాయి. మొత్తంగా 2015తో పోల్చితే 2022 నాటికి 72% కేసులు తగ్గాయి.
మలేరియా కనుమరుగు
మన్యంలో మలేరియా కేసులు దాదాపు కనుమరుగయ్యాయి. వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్‌శాఖ చర్యలు, మిషన్ భగీరథ ఫలితంగా మలేరియా కేసులు దాదాపు కనుమరుగయ్యాయి. 2015లో 6,196 కేసులు నమోదుకాగా, 2022 నాటికి 77కు పడిపోయాయి. సుమారు 99 శాతం తగ్గుదల నమోదైంది.
సగానికి తగ్గిన డయేరియా కేసులు
శుద్ధి చేసిన నీళ్లను తాగుతుండటంతో డయేరియా గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా మిషన్ భగీరథ పూర్తిస్థాయిలో అమలైన 2021 నుంచి స్పష్టమైన మార్పు కనిపించింది. 2020లో 7,931 డయేరియా కేసులు నమోదు కాగా.. శుద్ధ జలం సరఫరా కారణంగా 2021లో కేసుల సంఖ్య 4,116కు తగ్గిపోయింది. అంటే కేసులు దాదాపు సగానికి సగం పడిపోయాయి. 2022లో ఏకంగా 72% తగ్గుదల కనిపించింది. కేవలం 1,127 కేసులు నమోదయ్యాయి. 2015తో పోల్చితే.. 2022 నాటికి 86 శాతానికిపైగా తగ్గుదల నమోదైంది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

