హైదరాబాద్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ) : 35 కోట్ల రూపాయల ఆస్తులున్న వ్యక్తి పేదవాడా? తాను, తన భార్య పేరుపై కోట్ల విలువ చేసే 20 ఎకరాల భూమి కలిగిన వ్యక్తి పేదవాడా? తన భార్యకు 2 కేజీల బంగారు నగలున్న వ్యక్తి పేదవాడా? ఈ ఆస్తుల చిట్టా చూసిన ఎవరికైనా ఆ వ్యక్తి గరీబ్ బిడ్డ కాదు, కరోడ్‌పతి బిడ్డ అని ఇట్టే అర్థమవుతుంది. కానీ సీఎం రేవంత్‌రెడ్డికి మాత్రం కోట్ల విలువైన ఆస్తులున్న సదరు వ్య క్తి గరీబ్బిడ్డలా కనిపిస్తున్నాడు. అవును ఈ ఆస్తుల చిట్టా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ కాగా, సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన ఆ గరీబ్ బిడ్డ కూడా నవీన్యాదవే కావడం గమనార్హం. బుధవారం షేక్‌పేటలో ఎన్నికల ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘నవీన్‌యాదవ్ గరీబ్ బిడ్డ, నవజవాన్’ అంటూ అంతా ఆశ్చర్యపోయే వ్యాఖ్యలు చేశారు. ఇలా ఒక్కసారి కాదు, పదే పదే గరీబ్ అని పేర్కొన్నారు. దీంతో కరోడ్‌పతి బిడ్డను గరీబ్ బిడ్డ అంటూ ప్రచారం చేస్తూ జూబ్లీహిల్స్ ఓటర్లను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక సీఎం వ్యాఖ్యలు విన్న వారంతా నవ్వుకుంటున్నారు. నవీన్‌యాదవ్ గరీబ్ బిడ్డనా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. కోట్ల అస్తులన్న నవీన్యాదవే గరీబ్ బిడ్డ అయితే పూటపూటకు పోరాటం చేసే తాము కోటీశ్వరులమా అని ఎద్దేవా చేస్తున్నా రు. అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలి. మరీ ఇంత దిగజారి అబద్ధాలు చెప్పడం ఏంటని మండిపడుతున్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడుతున్నారు. గెలుపు కోసం ఇంత బహిరంగంగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారా అంటూ నిలదీస్తున్నారు.
గరీబ్ బిడ్డ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ముద్దుగా పిలుచుకున్న జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆస్తుల చిట్టా భారీగానే ఉన్నది. ఆయనకు ఆస్తులతో పాటు క్రిమినల్ కేసులు సైతం బాగానే ఉన్నాయి. నామినేషన్లో భాగంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను పొందుపరిచారు. ఈ అఫిడవిట్ ప్రకారం నవీన్ యాదవ్‌కు రూ. 35 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్టు వెల్లడించారు. అయితే బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ వందల కోట్లలో ఉంటుందని ప్రచారం జరుగుతున్నది. పరిశ్రమ రంగానికి కేరాఫ్ అయినటువంటి సంగారెడ్డి జిల్లాలో తన పేరిట 14.39 ఎకరాలు, తన భార్య పేరిట 4.3 ఎకరాల భూమి ఉన్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా తన భార్యకు 2 కేజీల బంగారు ఆభరాణాలు ఉన్నట్లు వెల్లడించారు. ఇక బ్యాంకుల్లో రూ. 37.6 లక్షల నగదు ఉన్నట్టు పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్‌లో ముస్లింల ఓట్ల కోసం సీఎం రేవంత్‌రెడ్డి నానా పాట్లు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే కాంగ్రెస్‌కు ఇజ్జత్ లేకుంటే మీకు దిక్కులేదు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ముస్లింల ఆగ్రహానికి గురైన రేవంత్‌రెడ్డి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బుధవారం షేక్‌పేట ప్రచారంలో ముస్లింల టోపీ ధరించి ప్రసంగించారు. ముస్లింలంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని వ్యాఖ్యానించారు.
తమ పాలనలో రెప్పపాటు కూడా కరెంట్ పోవడం లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క పదే పదే చెప్తున్నారు. కరెంట్ కోతలపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడుతున్నారు. కానీ కరెంట్ కోతలు నిజమేనని సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలోనే తేలిపోయింది. బుధవారం షేక్‌పేట డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో అక్కడ కరెంట్ పోయింది. దీంతో ఆయన చీకట్లోనే ప్రసంగించారు. కరెంట్ కోతల్ని దాచేందుకు గానూ సీఎం రేవంత్‌రెడ్డి కరెంట్ పోవడంపై ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. అసలు అక్కడ కరెంట్ ఉన్నట్టుగానే మాట్లాడడం గమనార్హం.