హైదరాబాద్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): చలికాలం వస్తూవస్తూనే భయపెడుతున్నది. గత ఏడాది కంటే ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు కురుస్తున్నది. గత ఏడాది ఇదే రోజున రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రత అత్యంత తక్కువగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లిలో 13.1 డిగ్రీల సెల్సియస్ నమోదుకాగా, ఈ ఏడాది రంగారెడ్డి జిల్లా కడ్తాల్లో అప్పుడే 11.6 డిగ్రీలకు పడిపోయింది.
గత సంవత్సరం కేవలం 5 జిల్లాల్లో మాత్రమే సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఈ ఏడాది 22 జిల్లాల్లో నమోదు అయ్యాయి. ఈశాన్య రుతుపవనాల వల్ల కురిసే వర్షాలు ఈ నెల 29 నుంచి ఆగ్నేయ ద్వీపకల్పంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోకి ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఈ నెల 30 వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నది.