e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News ధాన్యం కొనాల్సిందే

ధాన్యం కొనాల్సిందే

  • పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీల తీవ్ర నిరసన
  • రోజంతా ఆందోళనలతో దద్దరిల్లిన ఉభయ సభలు
  • వెల్‌లోకి దూసుకెళ్లిన సభ్యులు..లోక్‌సభ వాయిదా
  • కేంద్రం దిగొచ్చేవరకు పోరాడుతాం: కేకే, నామా

హైదరాబాద్‌, నవంబర్‌ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం సేకరణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనకు దిగటంతో పార్లమెంటు ఉభయ సభలు మంగళవారం దద్దరిల్లాయి. ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి, స్పీకర్‌ పోడియం ముందు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ తీవ్ర నిరసన తెలిపారు. ఉభయసభల్లో టీఆర్‌ఎస్‌ సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించటంతో వారు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. దీంతో లోక్‌సభ పలుసార్లు వాయిదా పడింది. పార్లమెంటు బయట కూడా ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ధాన్యం సేకరణపై స్పష్టత ఇచ్చేవరకు పోరాటం ఆపేదిలేదని తేల్చిచెప్పారు.

వాయిదా తీర్మానాలు.. నిరసనలు

పార్లమెంటు శీతాకాల సమావేశాల రెండోరోజు మంగళవారం లోక్‌సభ, రాజ్యసభల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ధాన్యం సేకరణపై వాయిదా తీర్మానాలిచ్చారు. వాటిని రెండు సభల్లో తిరస్కరించటంతో ఎంపీలు ఆందోళనకు దిగారు. లోక్‌సభలో స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి నినాదాలతో సభా కార్యకలాపాలను అడ్డుకొన్నారు. ధాన్యం సేకరణపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని నినాదాలు చేశారు. దీంతో స్పీకర్‌ ఓంబిర్లా సభను వాయిదా వేశారు. వెంటనే పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసనకు దిగారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత నిరసన కొనసాగించారు. ధాన్యం సేకరణపై జాతీయ విధానాన్ని ప్రకటించాలని, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. సాగుచట్టాలపై పోరాటంలో అమరులైన రైతు కుంటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని నినాదాలు చేశారు. దీంతో సభ మరోసారి వాయిదా పడింది. మధ్యహ్నం 3 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు మాట్లాడారు. ధాన్యం సేకరణపై బీజేపీ నేతలు ఢిల్లీలో ఒక మాట, గల్లీలో మరోమాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో అత్యధికంగా వరిపంట పండిస్తున్న రాష్ట్రంపట్ల కేంద్రప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అలసత్వం ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు.

కేంద్రం చర్యలు దుర్మార్గం

- Advertisement -

కేంద్రం ప్రతి విషయంలోనూ అప్రజాస్వామికంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు విమర్శించారు. రాజ్యసభ వాయిదా పడిన అనంతరం పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్ర హం వద్ద టీఆర్‌ఎస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా రాజ్యసభలో 12 మంది సభ్యులను సస్పెండ్‌ చేశారని, ఇది ప్రజాస్వామ్యానికి పెను విఘాతమని పేర్కొన్నారు. కేంద్రం వెంటనే జాతీయ పంటల సేకరణ విధానం తీసుకురావాలని డిమాండ్‌చేశారు. నిరసనలో ఎంపీలు సంతోష్‌కుమార్‌, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, బండా ప్రకాశ్‌, లింగయ్యయాదవ్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పసునూరి దయాకర్‌, మాలోత్‌ కవిత, పీ రాములు, వెంకటేశ్‌, రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.

రైతు ద్రోహి బీజేపీ

బీజేపీ రైతు ద్రోహి పార్టీ అని, రైతులను నిండా ముంచేందుకు కంకణం కట్టుకున్నదని టీఆర్‌ఎస్‌ ఎంపీలు విమర్శించారు. ధాన్యం సేకరించకుండా తెలంగాణ రైతులను కేంద్రం నానా కష్టాలు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం తమను ఎన్నిరకాలుగా అవమానించినా రైతుల కోసం అన్నీ భరిస్తున్నామని వెంకటేశ్‌ నేత అన్నారు. తెలంగాణలోనే రాసులకొద్ది వరి దిగుబడి వస్తుంటే ఇతర రాష్ర్టాల నుంచి బియ్యం తీసుకొచ్చి రీసైక్లింగ్‌ చేస్తున్నారని అడ్డగోలుగా మాట్లాడిన బీజేపీ ఎంపీ అర్వింద్‌ను పిచ్చాసుపత్రికి పంపాలన్నారు. ధాన్యం సేకరణ, వరిపంట సాగుపై బీజేపీ నేతలు రైతులను ఆయోమయానికి గురిచేస్తున్నారని ఎంపీ పసునూరి దయాకర్‌ విమర్శించారు. బీజేపీ నేతలు రైతులతో రాజకీయాలు చేయటం ఆపాలని ఎంపీ మాలోత్‌ కవిత డిమాండ్‌చేశారు. అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్‌ను, రాష్ట్రప్రభుత్వాన్ని కేంద్రం మెచ్చుకోవటం బీజేపీ రాష్ట్ర నాయకులకు కనిపించటంలేదా? అని ఎంపీ రాములు నిలదీశారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement