హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 21 ( నమస్తే తెలంగాణ ): బేగంపేట విమానాశ్రయంలో నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన ‘వింగ్స్ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శన ఆదివారం ముగిసింది. చివరిరోజు సందర్శకులు భారీగా తరలిరావడంతో ఎయిర్పోర్టు కిటకిటలాడింది. ఆకాశంలో విహంగాల విన్యాసాలు రసవత్తరంగా సాగుతుంటే ఆ అద్భుతాన్ని చూస్తూ వీక్షకులు మైమరిచిపోయారు. కదనరంగంలో దుంకుతున్నట్టుగా హెలిప్యాడ్లు సారంగ్ విన్యాసాలతో అబ్బురపరిచాయి.
సందర్శకులు తమ కరతాల ధ్వనులతో ఎయిర్పోర్ట్ ప్రాంగణమంతా దద్దరిల్లింది. బోయింగ్, ఎయిరిండియా, ఇండిగో విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆ విమానాలతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. మరోవైవైపు విమానాల విడిభాగాల ప్రదర్శన కూడా ఆసక్తి రేకెత్తించేలా సాగింది. విమానాల తయారీలో వినియోగించే భాగాల పనితీరుపై సంబంధిత నిపుణులు సందర్శకులకు అవగాహన కల్పించారు. మొత్తం రెండు రోజుల ప్రదర్శనకు సుమారు 1.75 లక్షల మంది సందర్శకులు తరలివచ్చినట్టు ఏవియేషన్ నిర్వహణ వర్గాలు తెలిపాయి.