వేములవాడ టౌన్, మార్చి 15: బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేస్తానని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమితి డైరెక్టర్ సుమలతా సుధాకరశర్మ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీరాజరాజేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా లబ్ధిపొందిన బ్రాహ్మణులకు మంగళవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్రాహ్మణుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని చెప్పారు. బ్రాహ్మణ కుటుంబాలు సంక్షేమ పథకాల ద్వా రా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవచ్చని వివరించారు. పట్టణంలోని దాదాపు 25 మందికి రుణాలు మంజూరయ్యాయని, కేసీఆర్ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, ఆయనకు రాష్ట్రంలోని బ్రాహ్మణ కుటుంబాలు రుణపడి ఉంటాయని చెప్పారు. కార్యక్రమం అనంతరం సుమలతాసుధాకరశర్మను లబ్ధిదారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్ష, కార్యదర్శులు మామిడిపెల్లి రాజన్న, రాగంపేట హరిబాబు, సీనియర్ న్యాయవాది కేశన్నగారి గోపీకృష్ణ, చంద్రమోహన్, పారువెల్ల వెంకన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.