హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): హైకోర్టు ఆదేశించినా.. మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు కాంగ్రెస్ సర్కారు చేతులు రావడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుడు వివిధ కారణాలతో మరణించిన 141 మంది రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు నిరాకరించడమేంటని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. రూ. 9.98 కోట్లు విడుదల చేస్తే కుటుంబాల గోస కొంతైనా తీరేదని, కానీ ఈ సర్కారుకు చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైకోర్టు ఆదేశాలంటే లెక్కలేదా?
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు 2018లో రైతుబీమా పథకం అమల్లోకి తీసుకొచ్చింది. 18-59 ఏండ్ల వయస్సు ఉన్న రైతులు ఏ కారణంతో చనిపోయినా ఆ కు టుంబానికి రూ.5 లక్షల పరిహారం అందిస్తూ వచ్చింది. రైతుల తరఫున బీమా ప్రీమియంను కూడా కేసీఆర్ ప్రభుత్వమే చెల్లించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత, ఈ పథకం అమల్లోకి రాకముందు మరణించిన 141మంది రైతుల కుటుంబాలకు పరిహారం అందలేదు. పరిహారం కోసం రైతులు హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ తర్వాత 2023 నవంబర్‌లో 141మంది రైతులకు రూ.6లక్షల చొప్పున పరిహారం అందించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పరిహారం అందించలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిహారంపై తీవ్రమైన జాప్యం చేసింది. దీంతో రైతుల తరుఫున రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు ప్రభుత్వంపై ధిక్కరణ కేసు వేశారు. ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో 2025 జనవరి 9న రైతు కుటుంబాలకు రూ. 9.98 కోట్ల పరిహారం ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ నయా పైసా పరిహారం ఇవ్వలేదు.
కాంగ్రెస్ పాలన ఇంత అధ్వానమా?
హైకోర్టు చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించకపోవడం బాధాకరం. ప్రభుత్వం వద్ద రూ.10 కోట్లు కూడా లేవా. హైకోర్టు ఆదేశాలను, ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయడం లేదంటే పాలన ఎంత అధ్వానంగా నడుస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. బాధిత రైతుల కుటుంబాలు నిరీక్షిస్తున్నాయి. ఇప్పటికైనా పరిహారం విడుదల చేయాలి.
-కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక సభ్యుడు