హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : టీజీపీఎస్సీలో సంస్కరణలు చేపట్టనున్నారా? పోటీ పరీక్షలు సహా గ్రూప్స్ సిలబస్ మార్చనున్నారా? కొన్ని అంశాలను తొలగించనున్నారా? గ్రూప్-1, గ్రూప్-2లో మళ్లీ ఇంటర్వ్యూ విధానం తీసుకురానున్నారా? అంటే.. అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. సిలబస్ సహా పరీక్షల విధానంపైనా టీజీపీఎస్సీ అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది. మళ్లీ గ్రూప్-1, గ్రూప్-2లో ఇంటర్వ్యూలు పెడితే ఎలా ఉంటుందనే అంశాన్ని సైతం అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. కాగా, పోటీ పరీక్షల సిలబస్‌ను 2015లో ఖరారుచేశారు. అప్పట్లో 25 మంది విషయ నిపుణులతో టీజీపీఎస్సీ కమిటీని ఏర్పాటుచేసింది. ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ కమిటీ పలు అంశాలపై కూలంకశంగా చర్చించి పలు సిఫారసులు చేసింది. అప్పటి నుంచి ఇదే విధానం అమలవుతుండగా, తాజాగా సిలబస్‌ను మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే సిలబస్‌లో కొన్ని అంశాలను తొలిగిస్తే ఆయా అంశాలను చదివిన వారికి నష్టం కలిగే అవకాశమున్నది. ఇప్పటికే కొనుగోలు చేసిన పుస్తకాలు, మెటీరియల్ వృథా కానున్నది. కొత్త అంశాలను చేర్చితే మళ్లీ కొత్తగా ప్రిపేరవ్వాలంటే మరింత సమయం పడుతుంది. కొత్త పుస్తకాల కొనుగోలుతోపాటు కోచింగ్ సెంటర్లను ఆశ్రయించాల్సి ఉంటుందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని మున్సిపాలిటీ కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కాంట్రాక్టర్లు గురువారం ధర్నా చేపట్టారని, తాము కూడా అదే మార్గంలో పయనిస్తామని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల పరిధిలో రూ.3000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయని కాంట్రాక్టర్లు రాజేశ్ లహోటి, మహేశ్‌కుమార్ చెప్పారు.