హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న రెండు ఆర్జీయూకేటీల ఏర్పాటుపై ప్రతిష్ఠంభన నెలకొన్నది. వీటి ఏర్పాటు విషయంలో ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చం దంగా పరిస్థితి తయారయ్యింది. రాష్ట్రంలో కొ త్తగా రెండు ఆర్జీయూకేటీలను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది.
ఇప్పటికే ఉత్తర తెలంగాణలో ఈ ఆర్జీయూకేటీ ఉండగా, దక్షిణంలో మహబూబ్‌నగర్, తూర్పున ఖమ్మంలో కొత్తగా ఆర్జీయూకేటీలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. సంబంధించిన ప్రతిపాదనలను ఏడాది క్రితం విద్యాశాఖ అధికారులు విద్య సంస్కరణల క్యాబినెట్ సబ్ కమిటీ ముందుంచారు. వెయ్యి సీట్లతో ఒక్కో కాలేజీని ప్రారంభించేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి నివేదించారు. ఏడాది గడిచిపోయింది. ఇంత వరకు వీటిని ఏర్పాటు చేస్తూ జీవోలు మాత్రం విడుదల కాలేదు.
ఖమ్మంకు బదులుగా ఎల్కతుర్తిలో..
ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయలనుకున్న ఆర్జీయూకేటీని హనుమకొండ జిల్లాలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. ఖమ్మం జిల్లాకు ఇటీవలే ఎర్త్ సైన్స్ వర్సిటీని మంజూరుచేశారు. నిరుడు జేఎన్టీయూ కాలేజీ మంజూరయ్యింది. దీంతో ఆర్జీయూకేటీని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. స్థల పరిశీలన సైతం పూర్తయ్యింది.
ఎల్కతుర్తి, మహబూబ్‌నగర్‌లలో కొత్త ఆర్జీయూకేటీల ఏర్పాటుకు రూ. 800కోట్ల నిధులు అవసరమవుతాయి. రాష్ట్ర బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఈ నెలలోనే ఆర్జీయూకేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలకానున్నది. ఈ సారి కొత్తవాటి ప్రస్తావన లేకుండానే, బాసరలో అడ్మిషన్లు కల్పించేందుకే ప్రవేశాల నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేయనున్నారు.
మన దగ్గర ఒక్కటే..
రాష్ట్రంలో ప్రస్తుతం బాసరలో ఆర్జీయూకేటీని నిర్వహిస్తున్నారు. 2008లో దీనిని ప్రారంభించారు. ఆరేండ్ల బీటెక్ కోర్సును ఈ వర్సిటీలో నిర్వహిస్తుండగా, 9వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉమ్మడి ఏపీలో మూడు ఆర్జీయూకేటీలుండగా.. రాష్ట్ర విభజనతో రెండు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడంతో ఉన్న ఒక్క ఆర్జేయూకేటీపై అధిక ఒత్తిడి పడుతున్నది. ఏపీలో ఉన్న రెండింటికి తోడు కొత్తగా మరో రెండు ఆర్జీయూకేటీలను ఏర్పాటు చేశారు. ఏపీలో నాలుగు ఆర్జీయూకేటీలుండగా, మన దగ్గర ఒకే ఒక్క వర్సిటీ ఉంది. ఈ వర్సిటీలో సీట్ల కోసం భారీగా డిమాండ్ ఉంది. కొత్తగా రెండు ఆర్జీయూకేటీలను ఏర్పాటుచేయాల్సి ఉండగా, ఇప్పటికే రెండేండ్లు గడిచిపోయింది.