హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన జరిగి పన్నెండున్నరేండ్లు కావస్తున్నా.. ఏపీ నేతలు తెలంగాణపై ఏదో ఓ రూపంలో తమ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. తాజాగా సోమవారం ఏపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 65 ఏండ్ల పాటు హైదరాబాద్ అభివృద్ధికి భారీగా ఖర్చు చేశారని, మన రాజధాని డెవలప్ అయింది అనుకునేలోపే అక్కడి నుంచి తమను తరిమేశారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ నుంచి తరిమేసినప్పుడు తాము బాధపడినట్టు చెప్పారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో అక్కడే భారీగా పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొన్నారు. రాజధాని డెవలప్ అయింది అనుకునేలోగా వాళ్లు వెళ్లిపో అని చెప్పగానే ఖాళీ చేతులతో వచ్చేశామని అన్నా రు. ఆ 65 ఏండ్లపాటు ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయం మొత్తాన్ని హైదరాబాద్‌కే వెచ్చించారంటూ విషం చిమ్మారు.
ఇప్పుడు అమరావతిలోనే డబ్బంతా పెడుతామంటూ చంద్రబాబు రెండేండ్లలోనే మూడున్నర లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన తర్వాత వెళ్లిపోవాలంటే ఎక్కడికి వెళ్లాలి? అని ప్రశ్నించారు. ఒకే చోట రాజధాని అని చెప్పడం సరికాదని అన్నారు. ఉమ్మడి ఏపీలో ఆనాడు హైదరాబాద్‌కు సమకూరిన ఆదాయాన్ని ఆంధ్రా ప్రాంతానికి అడ్డగోలుగా తరలించుకుపోవడం కూడా తెలంగాణ ఉద్యమానికి ఓ కారణమనే లాజిక్ మరిచి ధర్మాన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.