MLC Kavitha | మంథని : కేంద్రంలోని బీజేపీ సర్కార్ కక్ష్యపూరితంగానే భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ మాటున వేధింపులకు గురిచేస్తోందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆరోపించారు. మంథని పట్టణంలోని విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రోజురోజుకు ఇంటలీజెన్స్ వర్గాల ద్వారా వెల్లడవుతున్న సర్వేల్లో బీఆర్ఎస్ పార్టీ బలపడుతోందని, బీజేపీ పలుచబడుతోందని తెలుస్తోందని, ఈ విషయాన్ని బీజేపీ ప్రభుత్వం గుర్తించాలన్నారు.
ఇలాంటి చర్యలకు పాల్పడితే.. 2018 ఎన్నికల్లో ఎలా డిపాజిట్ కోల్పోయారో అదే రీతిలో కనీస ఓట్లు వచ్చే అవకాశాలు ఉండవని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్గా మారిన తర్వాత బీజేపీలో భయం మొదలైందని, తమకు అడ్డు వచ్చిన వారిపై ఈడీ, సీబీఐతో బ్లాక్ మొయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నిరంకుశ పాలన చేస్తున్న బీజేపీ సర్కారు ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చ అన్నారు. అధికారం శాశ్వతం కాదని చరిత్ర చెబుతోందని, అదికారంలో ఉన్నన్ని రోజులు ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని, అధికారంలో ఉన్న సంస్థలను వాడుకుంటూ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని హితవు పలికారు.
ఈ విషయాన్ని మోదీ సర్కార్ గుర్తించాలన్నారు. గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని అధికారంలోకి వచ్చిన విషయాన్ని గమనించాలని, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా ఈడీతో వేధింపులకు గురిచేసి అమిత్‌షాను జైలుకు పంపించిన విషయాన్ని మర్చిపోవడం దురదృష్టకరమన్నారు. అలా ఇబ్బందులు ఎదుర్కొని అదేరీతిలో ప్రధాన మోదీ, అమిత్‌షాలు వ్యవహరించడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామన్నారు. ఇలాంటి దాడులు, బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదన్నారు.
ఎమ్మెల్సీ కవితతో మంథని నియోజకవర్గ ప్రజలకు మంచి అనుబంధం ఉందని, అమెకు అండగా ఈ ప్రాంత ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు. భూపాలపల్లి జడ్పీ అధ్యక్షురాలు జక్కు శ్రీహర్షిణి మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితకు మహిళలంతా మద్దతుగా నిలుస్తామన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత చేపట్టిన నిరాహర దీక్షకు మహిళా సంఘాలు, బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు అండగా నిలుస్తున్నాయన్న భయంతో కేంద్రంలోని ఈడీ విచారణ పేరుతో బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.