హైదరాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ): పార్టీలో తనకు జరిగిన అవమానంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రగిలిపోతున్నారు. ఎంత బుజ్జగించినా తగ్గేదే లే అంటున్నారు.ఎమ్మెల్సీ పదవికి రాజీనామా కు సై అంటున్నారు. పార్టీని వీడేందుకూ వెనకాడబోనని అంటున్నట్టు తెలిసింది. ఇది పదవుల పంచాయితీ కాదని, వ్యక్తిత్వానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు.తాను చేయని పదవి లేదని, అధికారం కొత్తకాదని తెలిపారు. 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ జరగని అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిణామాలపై సన్నిహితుల వద్ద ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. తాను ఏం చేయబోతున్నానో వారికి స్పష్టం చేశారు. ‘జీవన్‌రెడ్డి అనేవాడు జీవితం లో ఏనాడూ రాజీపడలేదు. ఇప్పుడు కూడా రాజీపడబోడు. రాసిపెట్టుకోండి’ అంటూ కార్యకర్తలు, సన్నిహితులకు తేల్చి చెప్పారు. ఇప్పటికీ తాను రాజీనామాకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసినట్టు తెలిసింది.మంగళవారం తనను బుజ్జగించేందుకు వచ్చిన మంత్రులు భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబు వెళ్లిన తర్వాత కూడా రాజీనామాకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు.
1983లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జీవన్‌రెడ్డి 40 ఏండ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారు. ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర్‌రావు, రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అధిష్ఠానానికి అనుంగు కార్యకర్తగా పేరుపొందిన జీవన్‌రెడ్డి తొలిసారి పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పడం గమనార్హం. ఆయనకు సొంత పార్టీలోనే ఘోర అవమానం జరిగింది. తనను రెండుసార్లు ఓడించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను కనీసం సమాచారం ఇవ్వకుండా పార్టీలో చేర్చుకోవడంపై ఆయన రగిలిపోతున్నారు.
సొంత నియోజకవర్గంలో తనను సంప్రదించకుండా ఇతర పార్టీ ఎమ్మెల్యేను చేర్చుకోవడంపై ఇదేం సంస్కారమని పార్టీ నేతలను నిలదీస్తున్నారు. ఇదేనా రాజకీయం అని ప్రశ్నిస్తున్నారు. 40 ఏండ్లుగా పార్టీకి చేసిన సేవకు ఇదేనా తనకు ఇచ్చే గౌరవం అని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యర్థుల ముందు తనను తలదించుకునేలా చేశారం టూ ఆగ్రహంతో ఉన్నారు.
ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నానని, పదవుల కన్నా తనకు తన జీవితం, ఆత్మగౌరవం ముఖ్యమని తేల్చి చెబుతున్నారు. అందుకే ఇక తగ్గేదేలేదని తేల్చి చెప్తున్నారు. పార్టీకి తనతో అవసరం లేదని భావించినప్పుడు, తనకు మాత్రం ఏం అవసరమని సన్నిహితుల వద్ద అన్నట్టుగా తెలిసింది. అందుకే ఈ విషయంలో రాజీపడబోనని, అవసరమైతే అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకుంటానని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని, అవసరమైతే పార్టీకి కూడా రాజీనామా చేసేందుకు వెనకాడబోనని ఆయన చెప్పినట్టు సమాచారం.