KTR | హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేస్తున్న రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించి తీరుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. సోమవారం నందినగర్‌లోని తన నివాసంలో మీడియా అడిగిన ఒక ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ.. నాలుగేండ్లలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి, కాంగ్రెస్ కోరుకున్న చోట ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పారు. తెలంగాణ పౌరుషం, తెలంగాణ వైభవాన్ని చాటేలా అద్భుతమైన డిజైన్‌తో సచివాలయాన్ని కేసీఆర్ సర్కారు నిర్మించిందని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేలా సచివాలయం ఎదురుగా ఒక ఐలాండ్‌ను క్రియేట్ చేశామని, దశాబ్ది ఉత్సవాల్లోనే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టామని, ఆ మహనీయుడికి ఘనమైన నివాళి అర్పించేలా అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. తెలంగాణ అమరుల త్యాగాలను గుర్తుచేసేలా అమరజ్యోతి స్మారకాన్ని నిర్మించామన్నారు.
కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పెడుతున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు మాజీ సీఎం అంజయ్య పేరుతో ఉన్న పారు కాస్తా లుంబిని పార్కు అయ్యిందని, అదే అం జయ్య పారు ఎదురుగా ఆయనను అవమానించిన రాజీవ్‌గాంధీ విగ్రహం పెడుతున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏనాడూ పేర్ల మార్పుపై ఆలోచించలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే ప్రభుత్వ పథకాలు, ప్రాంతాలకు కాంగ్రెస్ నాయకుల పేర్లు ఉన్నా వాటిని మార్చే ప్రయత్నం చేయలేదని వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్‌గాంధీ ట్రిపుల్ఐటీ, రాజీవ్ గాంధీ ఉప్పల్ స్టేడియం, హైదరాబాద్-కరీంనగర్ రహదారికి రాజీవ్ రహదారి, అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్‌గాం ధీ అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇలా ఎన్ని పేర్లున్నా వాటిని తాము మార్చలేదని చెప్పా రు. కానీ తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత బాధతో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తరలిస్తామని చెప్తున్నామని వివరించారు. ఢిల్లీకి గులాములుగా ఉన్న కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ పౌరుషం కలిగిన బిడ్డగా చెప్తున్నానని.. ఆ విగ్రహాలను మార్చే దిశగా ఆలోచన చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో రా ష్ట్రంలో రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ పేర్లతో ఉన్న పథకాలు, ప్రాంతాల పేర్లను కూడా మా రుస్తామని తెలిపారు. హైదరాబాద్ విమానాశ్రయానికి తెలంగాణ ప్రముఖుడి పేరు పెడతామని వెల్లడించారు. ముంబై విమానాశ్రయానికి ఛత్రపతి శివాజీ, బెంగళూరు విమానాశ్రయానికి కెంపెగౌడ అని పేర్లు ఉన్నాయని.. తెలంగాణకు సంబంధం లేని రాజీవ్‌గాంధీ పేరున్నా తాము తొలగించలేదని గుర్తుచేశారు.
ఎనిమిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల మీద జరిగిన అఘాయిత్యాలు ఇప్పుడు గుర్తుకు వచ్చినందుకు మంచిదేనని కేటీఆర్ అన్నారు. కొల్లాపూర్‌లో చెంచు మహి ళ, షాద్‌నగర్‌లో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్ర యోగించినా ప్రభుత్వం దున్నపోతుపై వానప డ్డట్టు వ్యవహరించిందని, మహిళా మంత్రులు స్పందించలేదని మండిపడ్డారు. తమ మాజీ మంత్రులు షాద్‌నగర్‌కు వెళ్లాకే పోలీసులను సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇం కా ఎన్నో అఘాయిత్యాలు, అత్యాచారాలు జ రుగుతున్నాయని తెలిపారు. రాష్ర్టానికి హోం మంత్రి దిక్కులేరని ధ్వజమెత్తారు. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్య ఘటనపై ఢిల్లీలో డాక్టర్లు నిందితుడికి తెలంగాణ తరహా శిక్ష విధిం చా లని అడుగుతున్నారని, దటీజ్ కేసీఆర్ అని అన్నారు. సమావేశంలో మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మా జీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బిక్షమయ్యగౌడ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, అంజనేయగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి జై తెలంగాణ అని ఏనాడు అనడని, మహనీయుడు అంబేదర్కు కనీసం పూలదండ వేయడని, విగ్రహానికి ప్రముఖ రోజుల్లో లైటింగ్ ఏర్పాటు చేయని కుసంసారి అని కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద మెప్పు కావాలంటే.. రాహుల్ దగ్గర మార్కులు కొట్టేయాలనుకుంటే.. గాంధీభవన్‌లోనో, రేవంత్ ఇంట్లోనో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పెట్టుకొంటే తమకు అభ్యంతరం లేదని స్పష్టంచేశారు.