హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ మొండితనం ప్రదర్శించింది. దొడ్డు రకం వడ్లు (బాయిల్డ్ రైస్) కొనుగోలు చేసేందుకు నిరాకరించింది. రైతుల శ్రేయస్సు దృష్ట్యా దొడ్డు వడ్లు కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. బుధవారం ఢిల్లీలో యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ఆహార, ప్రజాపంపిణీశాఖ వివిధ రాష్ర్టాలతో సమావేశం నిర్వహించింది.
ఈ సందర్భంగా ఈ యాసంగిలో కూడా దొడ్డు వడ్లు తీసుకోబోమని స్పష్టంచేసింది. గత ఏడాది కూడా యాసంగి పంట కొనుగోలుపై కేంద్రం ఇదే వైఖరిని అవలంబించింది. దీంతో రాష్ట్రంలోని రైతాంగం ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పోరాటమే చేసింది. సీఎం కేసీఆర్ సైతం ప్రత్యక్షంగా ఢిల్లీలో జరిగిన రైతుల ధర్నాలో పాల్గొని కేంద్ర వైఖరిని తీవ్రంగా ఖండించారు. అయినా కేంద్రం స్పందించకపోవడంతో రూ.1,000 కోట్ల నష్టాన్ని భరించి రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ సీజన్లోనైనా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు వస్తుందని ఆశించారు. కానీ కేంద్రం మాత్రం రైతుల పట్ల తన నియంతృత్వ వైఖరిని కొనసాగించింది. రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో 57 లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యింది. దాదాపు 1.50 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఈసారి కూడా దొడ్డు ధాన్యం తీసుకునేది లేదని కేంద్రం భీష్మించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్.. మంత్రులు, అధికారులతో సమీక్షించనున్నట్టు సమాచారం.