సంగారెడ్డి, ఆగస్టు 6: కృష్ణా నదీ జలాల్లో చుక్కా వదులుకునేది లేదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే కృష్ణా నది నీటి వాటాకు అడ్డంకులను సృష్టిస్తున్నారని, తెలంగాణ న్యాయమైన వాటా కోసం సుప్రీంకోర్టులో పోరాటం చేస్తూనే కేంద్రం తీరును ఎండగడుతున్నామని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులోని తెలంగాణ టౌన్షిప్లో శుక్రవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సాధనకు జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ సిద్దించాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. సీఎం చలవతోనే సాగు, తాగు నీటి వెతలు తీరాయనీ, పారిశ్రామికంగా రాష్ట్రం దేశంలో ముందంజలో ఉందని తెలిపారు. విద్య, వైద్యరంగాల్లో అద్భుత పురోగతి సాధించామని వెల్లడించారు. తెలంగాణపై వివక్ష చూపుతూ కేంద్రం నీటి వాటాల విషయంలో న్యాయం చేయట్లేదని మంత్రి ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీసీసీబీ చైర్మన్ చిట్టీ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.