హైదరాబాద్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ) : నదీజలాల విషయంలో రాష్ట్ర హకులకు భంగం కలిగితే జల ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు హెచ్చరించారు. నదీ జలాల హకులకన్నా తమకు ఏదీ ముఖ్యం కాదని చెప్పారు. పోతిరెడ్డిపాడు, పట్టిసీమల ద్వారా పొరుగు రాష్ట్రం నీటిని తరలించుకుపోతుంటే రేవంత్‌రెడ్డి నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఆదిత్యానాథ్‌దాస్‌ను తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా నియమించడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు కీలుబొమ్మగా మారారనేందుకు నిదర్శనమని ఆయన విమర్శించారు. జీఆర్ఎంబీ అజెండాను ఒప్పుకొన్న మూర్ఖుడు ఎవరో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో శనివారం మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్‌చాట్‌లో మాట్లాడా రు. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన 10వేల ఎకరాల ప్రజల ఆస్తిని విక్రయించేందుకు రేవంత్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ పేరుతో కుట్ర చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ భూ దోపిడీపై హైదరాబాద్‌లోని ప్రతీ ఇండస్ట్రియల్ అసోసియేషన్‌కు లేఖ రాస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే హిల్ట్ పాలసీని రద్దు చేస్తామని, ఈ భూ దందాలో భాగస్వాములెవరైనా భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా సెప్టెంబర్ నెలలో హైదరాబాద్‌లో సదస్సులు నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ‘30పర్సంట్ కమీషన్ మంత్రి’గా అభివర్ణిస్తూ, కొంగరకలాన్‌లోని భూములను 22ఏ జాబితాలో చేర్చి ప్రైవేట్ కంపెనీలకు అధిక ధరకు కట్టబెట్టే కుట్ర జరుగుతున్నదని ఆరోపణలు చేశారు.
హైకోర్టు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోను అంటే ముఖ్యమంత్రికి న్యాయస్థానాలపై ఉన్న గౌరవం ఎంతో తెలిసిపోయింది. కోర్టులు చెప్పినా హైడ్రా విషయంలో రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని ప్రజాస్వామికవాదులు గుర్తించాలి. రేవంత్‌రెడ్డి ప్రజావ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనా విధానాన్ని గుర్తించాలి. రేవంత్‌రెడ్డి హిట్లర్ అని చెప్పుకొన్నట్టే రాజ్యాంగ వ్యవస్థలను పట్టించుకోవడం లేదు.
– కేటీఆర్
ఈ నెల 18న జరిగే జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాను ఒప్పుకొన్నారా? ఒకవేళ ఈ సమావేశానికి హాజరైతే తెలంగాణ ప్రజల తరఫున ఏం చెప్తారని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన రాష్ట్రం మరోసారి నీళ్ల దోపిడీకి గురవుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ వ్యతిరేకి ఆదిత్యనాథ్‌దాస్‌ని సలహాదారుగా పెట్టుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సిగ్గుమాలిన చర్య అని విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వ చెప్పుచేతల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నదని, రేవంత్‌రెడ్డికి సిగ్గుంటే ఆదిత్యనాథ్‌దాస్‌ని తొలగించాలని డిమాండ్ చేశారు. తాము లక్షల మంది రైతులతో వెళ్లి మహబూబ్‌నగర్ జిల్లాలో పంపులు ఆన్ చేస్తామంటేనే ఈ రోజు సర్కార్ పంపులను ప్రారంభించిందని పేర్కొన్నారు. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే రేవంత్‌రెడ్డికి ఆ జిల్లాకు నీళ్లు ఇచ్చే, చెరువు నింపే సోయి లేదని విమర్శించారు. పంపులు ఎప్పుడు ఆన్చేయాలి? నీళ్లు ఎప్పుడు ఎత్తిపోయాలో కనీస అవగాహన లేదని మండిపడ్డారు. వర్షాలు పడి పక రాష్ట్రం నీళ్లు ఎత్తిపోసుకుంటే సీఎంకు సోయి లేదని, ప్రధాన ప్రతిపక్షం ముల్లుకట్టెతో పొడిస్తేనే ఈ ప్రభుత్వం స్పందిస్తున్నదని లేదంటే నిద్రపోతున్నదని దుయ్యబట్టారు.
హైదరాబాద్‌లోని 10వేల ఎకరాల విలువైన భూమి పారిశ్రామిక భూముల విషయంలో రేవంత్‌రెడ్డి తలపెట్టిన రూ.5 లక్షల కోట్ల సామ్‌పై రాష్ట్ర ప్రజలను జాగృతం చేస్తామని కేటీఆర్ చెప్పారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో ప్రజల సొమ్మును కాజేసే కుట్రకు తెరలేపారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వేల కోట్ల రూపాయల సొమ్ములను దండుకునేందుకు తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చెప్పారు. హిల్ట్ పాలసీ ద్వారా రాష్ట్ర ప్రజల సొమ్మును ఏవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం జేబులో వేసుకుంటున్నదో ప్రజలందరికీ అర్థమయ్యేలా లేఖల రూపంలో, ప్రజెంటేషన్ల రూపంలో చైతన్యపరుస్తామని చెప్పారు. ప్రజల ఆస్తిని కాపాడేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతామని వెల్లడించారు.

గతంలో ముంబైతోపాటు ఇతర నగరాల్లో పారిశ్రామిక భూములను ప్రభుత్వం తీసుకొని తిరిగి రీ డెవలప్మెంట్ చేసిన ఉదంతాలను కా దని, ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా పాత భూ ముల ధరలకు కట్టబెట్టేందుకు రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ పాలసీ వల్ల ఎవరైనా భూములను రెగ్యులరైజ్ చేయించుకుంటే భవిష్యత్తులో తీరని నష్టం జరుగుతుందని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో ప్రజల అవసరాల కోసం ఒక ఎకరం భూమి అందుబాటు లో లేదని, ఆటస్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇం డ్లు, చివరికి శ్మశానాలకు కూడా భూములు లేని నగరంలో ప్రైవేట్ వ్యక్తులకు 10వేల ఎకరాలను దోచిపెట్టడం తీరని ద్రోహమని నిప్పులుచెరిగారు. ఒకప్పుడు ప్రజలు తమ ఆస్తిని పరిశ్రమల కోసం ఇచ్చారని, అక్కడ పరిశ్రమలు మాత్రమే నడుపాలని, అంతేకానీ మాల్స్ కట్టుకొని రి యల్ వ్యాపారం చేస్తామంటే కుదరదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం చేస్తున్న ఈ సామ్‌పై హైకోర్టుకు కూడా వెళ్తామని చెప్పారు. గతంలో తమ ప్రభుత్వం ఐటీ, సెజ్‌ల పేరిట డెవలప్ చేసి ఉ ద్యోగ.. ఉపాధి అవకాశాలు కల్పించడంతోపా టు ఐటీ పరిశ్రమను నగరం నలుమూలలా విస్తరించే లక్ష్యంతో పాలసీ తీసుకొస్తే రేవంత్.. దానిని మార్చి అప్పనంగా అమ్ముకొనేలా హిల్ట్ పాలసీ తెచ్చారని మండిపడ్డారు.
తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లం. ప్రత్యేక రాష్ట్రం కోసం త్యాగాలు చేసినవాళ్లం. క్షుద్ర రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ బాగుండాలని కోరుకుంటం. కాంగ్రెస్ లెక్క క్షుద్ర రాజకీయాలు మాకు తెలియదు. హరీశ్‌రావు గుడికి పోతే తప్ప? ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయవచ్చా?
ప్రభుత్వ భూములను అమ్ముకోవడమే కాకుండా ప్రజల వ్యక్తిగత ఆస్తులపై కూడా రేవంత్ కన్నేసి కాజేయాలని చూస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేవలం 16లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితాలో ఉంటే దానిని 1.20 కోట్లకు చేర్చి ప్రైవేట్ వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేస్తూ భూ కబ్జాలకు తెరలేపారని విమర్శించారు. ఇప్పుడు కొత్తగా 22ఏ పేరుతో హైదరాబాద్ నగరంలోనూ తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసేలా లక్షలాది మందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. కాలనీలకు కాలనీలను నిషేధిత జాబితాలో పెట్టి తమ సొంత కష్టార్జితంతో సంపాదించుకున్న 100 గజాలను కూడా అమ్ముకోకుండా అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. ఇది కేవలం కాంగ్రెస్ నాయకులు స్థానిక ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేసి బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిన పాలసీ అని ఆరోపించారు. డబ్బులు ఇస్తేనే ఎన్వోసీలు ఇచ్చేలా ఈ కొత్త నిర్ణయం తీసుకొన్నదని విమర్శించారు. అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ని రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు ధరణి పేరు మార్చి దాని ద్వారా నిషేధిత జాబితాలో పెట్టి అడ్డగోలుగా భూ అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి గజదొంగ మాదిరి, పొంగులేటి చిన్న దొంగ మాదిరిగా ప్రజల సొమ్మును కాజేస్తున్నారని ఆరోపించారు.
ప్రజల ఆస్తులను బహిరంగ మారెట్లో ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకొనేందుకు రేవంత్‌రెడ్డి హైడ్రా పేరుతో భూములను చెరబట్టి, ఇండ్లను కూలగొట్టి, విధ్వంసం సృష్టించారని కేటీఆర్ మండిపడ్డారు. హిట్లర్ ఆదర్శమని చెప్పిన రేవంత్‌రెడ్డి.. హిట్లర్ తరహాలోనే ప్రజల సొమ్మును, ఆస్తులను గుంజుకుంటున్నారని విమర్శించారు. చివరికి గ్రేహౌండ్స్ భూములను, మూసీ భూములను వదలకుండా హెరిటేజ్ రాక్స్ ఉన్న రాయదుర్గం భూములను సైతం వదిలిపెట్టడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన భూ కుంభకోణాలను, 22ఏ పేరిట జరుగుతున్న భూదోపిడీ, హిల్ట్ పాలసీ సామ్‌ను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టంచేశారు. గతంలో తాను చెప్పినట్టుగానే టీడీఆర్ హకులను అప్పనంగా కొని తర్వాత తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందించి పదుల రెట్లు అధిక ధరకి ఇప్పుడు బలవంతంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్ముకుంటూ వందల కోట్ల రూపాయల సామ్‌కి తెరలేపారని అన్నారు. ఒకప్పుడు ఎల్ఆర్ఎస్ భూములను ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజల వద్ద భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘నో బీఆర్ఎస్, నో ఎల్ఆర్ఎస్’ అని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మన నీటి హకులకు మించి మరో ప్రాధాన్యం మా పార్టీకి లేదు. నదీజలాల్లో కేంద్రమైనా, రాష్ట్రమైనా నష్టం కలిగించేలా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదు. నీటి వాటాల్లో అన్యాయం చేస్తే, తెలంగాణ ఉద్యమానికి మించి మరొక ఆందోళన పుట్టుకొస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించే ఎజెండాను ఒప్పుకొని కేఆర్ఎంబీ మీటింగ్‌కి హాజరవుతారో సీఎం రేవంత్, నీళ్ల మంత్రి ఉత్తమ్ చెప్పాలె.
– కేటీఆర్
నిరాధార ఆరోపణలతో కాంగ్రెస్ నేతలు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీలాగా మేడిగడ్డను, చెక్‌డ్యామ్‌లను ధ్వంసం చేసి ఓట్లు దండుకోవాలని చూడలేదని, గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నా వాటిని రైతులను ఇవ్వకుం డా ఎండబెట్టే సంస్కృతి తమది కాదని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం కరెం టు ఉండి కూడా సాగుకు 24గంటల కరెంట్ ఇవ్వడం లేదు. ఏ సబ్‌స్టేషన్‌కైనా రావడానికి మేము సిద్ధం. 24గంటల కరెంట్ వస్తే ఇంకా ఎకడ ఉన్నదో చెప్పా లి. కనీసం ఐదు, ఆరుసార్లు ప్రతిరోజూ కరెంట్ కోతలు అవుతున్నాయి. అడ్డగో లు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చా రు. వాటిని అమలు చేయాలని అడిగితే రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదు. చేయాల్సిన పనులు చేయకుండా దేవుడి పైన భారం వేస్తా అంటే ఆయన కూడా హర్షించడు’ అని కేటీఆర్ హెచ్చరించారు.
రాష్ట్ర పోలీస్ యంత్రాంగంపై నమ్మకం లేక హైకోర్టు ఏకంగా మిలిటరీని పంపుతామని అనడం రేవంత్ వైఫల్యానికి నిదర్శనమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఒక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని హైడ్రా విషయంలో అభిశంసన ఇచ్చిన తీరుగా ఎప్పుడూ చేయలేదని చెప్పారు. హైకోర్టు వ్యాఖ్యలు ముఖ్యమంత్రి అసమర్థతకు, వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ‘ప్రజలను విపత్తుల నుంచి రక్షించడానికి ఈవీడియం అనే సంస్థను పెట్టాం. దాని పేరు మార్చి ప్రజలను విపత్తుల్లోకి, విధ్వంసంలోకి నెట్టేలా హైడ్రాని తయారు చేశారు. పేదలను కొట్టి పొందిన 2,500 ఎకరాల భూమిని సేకరించి వాటిని పెద్దలకు అమ్ముతామని ప్రభుత్వం చెప్తున్నది. పేదలను కొట్టి పెద్దవాళ్లకు దోచిపెట్టడమే హైడ్రా ద్వారా రేవంత్ చేస్తున్న పని. గతంలో మా ప్రభుత్వ హయాంలో రెండున్నర లక్షల మందికి 58 జీవో ద్వారా పట్టాలు ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక పట్టా అయినా ఇచ్చిందా? పైగా వేలాది మంది ఇళ్లను కూలగొట్టారు’ అని కేటీఆర్ మండిపడ్డారు.