GHMC Council | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : ప్రజా సమస్యల పరిష్కార వేదికను కాంగ్రె స్ అపహాస్యం చేసింది. ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్ల గొంతునొక్కి, జీహెచ్ఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్షల్స్‌తో పాలకమండలి సమావేశం నుంచి బలవంతంగా బయటకు నెట్టేసింది. తోటి మహిళా కార్పొరేటర్లకు నిరసన తెలుపుకునే అవకాశం ఇవ్వకుండా, వారిని మార్షల్స్‌తో బయటకు పంపించిన మేయర్ తీరు చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఆమోదంపై గురువారం నిర్వహించిన బల్దియా పాలకమండలి సమావేశం రసాబాసాగా ముగిసింది. చర్చ లేకుండానే బడ్జెట్‌ను ఆమోదించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ఉదయం 10:35 గంటలకు ప్రారంభమైన జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశం.. ఆందోళనలు, ప్లకార్డుల చించివేతలు, కార్పొరేటర్ల అరెస్టులు, భిక్షాటనలు, బైఠాయింపులు వంటి కార్యక్రమాలతో హోరెత్తింది. తొలుత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్‌టాటా మృతికి సంతాపంగా రెండు నిమిషాలపాటు సభ మౌనం పాటించి నివాళులర్పించింది.
ఆనంతరం షెడ్యూల్ ప్రకారం ముందుగా ఆర్థిక సంవత్సరం (2025-26)కు సంబంధించిన రూ.8,440 కోట్ల బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టి, దానిపై చర్చించాల్సి ఉన్నది. కానీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎలాంటి చర్చ జరగకముందే బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందు ఆరు గ్యారెంటీలను ఆమలుచేయాలని, హైదరాబాద్ నగరానికి సరిపడా నిధులను వెంటనే మంజూరు చేయాలని ప్లకార్డులతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో మేయర్ ఆదేశాల మేరకు నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సింధూ ఆదర్శరెడ్డి, విజయశాంతి, విజయ్‌కుమార్‌గౌడ్, పద్మావెంకట్రెడ్డిని మార్షల్స్ బలవంతంగా బయటకు పంపించగా, పోలీసులు వారిని అరెస్టు చేసి ట్యాంక్‌బండ్ చుట్టూ తిప్పి జీహెచ్ఎంసీ ఆవరణలో వదిలిపెట్టారు. అనంతరం లోపలికి వచ్చేందుకు ఆ నలుగురు కార్పొరేటర్లు తిరస్కరించారు.
మేయర్ విజయలక్ష్మి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. మిగతా కార్పొరేటర్లు నిరసన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల చేతిలో ఉన్న ప్లకార్డులను కాంగ్రెస్ కార్పొరేటర్లు సీఎన్‌రెడ్డి, బాబా ఫసియుద్దీన్ లాక్కుని చించేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు మార్షల్స్ అవతారం ఎత్తి బీఆర్ఎస్ కార్పొరేటర్లపై విరుచుపడ్డారు. మహిళా కార్పొరేటర్లను సైతం నెట్టేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సభ్యులను మార్షల్స్ సహకారంతో మేయర్ బయటకు పంపించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు ఈడ్చుకుంటూ అరెస్ట్ చేసి రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, కాలేరు వెంకటేశ్, కేపీ వివేకానంద తదితరులు రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సంఘీభావం తెలిపారు.
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను బయటకు పంపి బడ్జెట్‌ను అమోదించడం దుర్మార్గమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. ఎలాంటి చర్చ జరగకుండానే బడ్జెట్‌ను అమోదించడం సరికాదని పేర్కొన్నారు.
నగర సమస్యలపై చర్చించాలని కోరిన కార్పొరేటర్లను అరెస్ట్ చేయడం సబబుకాదని ఎమ్మెల్సీ మహమూద్ అలీ మండిపడ్డారు. కాంగ్రెస్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని, మాటలు తప్ప అభివృద్ధి చేయడంలేదని విమర్శించారు.
ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పడం ఖాయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. ప్రజా సమస్యలపై సభలో చర్చించకుండా బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. కార్పొరేటర్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నగర అభివృద్ధికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రజల పక్షాన మాట్లాడిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేయడం అమానుషమని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విమర్శించారు. నగరంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం లేదని మండిపడ్డారు.
జీహెచ్ఎంసీ పాలక మండలిలో ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టు పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కార్ నిరంకుశ వైఖరికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని అడిగితే అరెస్టులు చేస్తారా? రాష్ట్రానికి గుండెకాయలాంటి హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ వైఖరిని నిలదీస్తే మార్షల్స్‌తో కార్పొరేటర్లను బడ్జెట్ కౌన్సిల్ నుంచి బయటికి పంపిస్తారా? అని మండిపడ్డారు. బడ్జెట్ మీద చర్చ లేకుండానే అమోదిస్తున్నట్టు ప్రకటించడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. ప్రజల తరుపున ప్రశ్నిస్తున్న ప్రజాప్రతినిధుల గొంతు నొకాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదలచేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశంలో ఎండగట్టినందుకు కార్పొరేటర్లను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా? అని మండిపడ్డారు. గత సంవత్సరపు బడ్జెట్ నిధులను కనీసం కూడా ఖర్చు చేయకుండా, మరోసారి అవే కాగితాలపై అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు తమ ప్రజాప్రతినిధుల గొంతు నొకుతారా? అని ప్రశ్నించారు.
ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జీహెచ్ఎంసీ అసమర్ధ తీరును ప్రశ్నించినా కాంగ్రెస్ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదని దుయ్యబట్టారు. హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. అప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. అరెస్టు చేసిన కార్పొరేటర్లను వెంటనే విడుదలచేయాలని డిమాండ్ చేశారు. హామీలను అమలను చేయకుండా అరెస్టుల పేరుతో ప్రజాప్రతినిధులను అణగదొకాలని చూస్తే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.