హైదరాబాద్, జనవరి 27 (నమస్తేతెలంగాణ): దేశవ్యాప్తంగా జంతుగణనకు అటవీ అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి 8 రోజులపాటు నల్లమలలో వన్యప్రాణుల సమగ్ర సమాచారం సేకరించనున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించిన జంతువుల వివరాలను ఎకలాజికల్, డిస్టెన్స్ యాప్‌లలో నమోదు చేస్తారు. నల్లమల పరిధిలోని 25 రేంజ్‌లు, 250బీట్లలో ఈ గణన నిర్వహించనున్నారు. 250 మంది సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు. ఒకో బీట్‌లో 15కిలోమీటర్ల చొప్పున రోజుకు 5కిలోమీటర్ల పరిధిలో సర్వే చేస్తారు. మూడు దశల్లో, ఐదు విధాలుగా ఈ గణన కొనసాగుతుంది.
యాప్‌లో వివరాల నమోదు
నల్లమలలో పులుల గణనతో పాటు ఏడాదికి రెండుసార్లు ఇతర జంతువుల లెకింపు చేపడతామని డీఎఫ్ సాయిబాబా తెలిపారు. సిబ్బంది మూడు విధాలుగా సర్వే చేసి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారని వివరించారు. సర్వేలో గుర్తించిన అనువైన ప్రదేశాల్లో పులుల గణనకు ఉపయోగపడేలా కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.