గద్వాల, సెప్టెంబర్ 16: నిద్రపోతున్న భర్తపై వేడి నూనె పోయడంతో తీవ్రంగా గాయపడ్డ అతడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా లో చోటుచేసుకున్నది. గద్వాల సీఐ శ్రీను కథ నం ప్రకారం.. మల్దకల్ మండలం మల్లెందొడ్డికి చెందిన వెంకటేశ్ (29), పద్మ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాలుగేండ్లుగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈనెల 10న మరోసారి దంపతులు కొట్లాడుకున్నారు. ఈ క్రమంలో భార్యపై భర్త చేయి చేసుకున్నాడు. దీంతో విసుగు చెందిన పద్మమ్మ 11వ తేదీ తెల్లవారుజామున నిద్రపోతున్న భర్తపై వేడినూనె పోసింది. కేకలు వేయడంతో వెంటనే కుటుంబ సభ్యులు అతడిని గద్వాల దవాఖానకు.. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఏపీలోని కర్నూల్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి వెంకటేశ్ మృతి చెందాడు. మల్దకల్ పోలీసులు కేసు నమోదు చేసి పద్మను రిమాండ్కు తరలించారు.