కరీంనగర్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): కట్టుకున్న భర్తను హత్య చేసి పోలీసులను తప్పుదోవ పట్టించిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత నెల 17న హత్య చేసిన భార్య.. లైంగిక చర్యల సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆమెతోపాటు సహకరించిన మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. గురువారం కరీంనగర్ కమిషనరేట్‌లో హత్య వివరాలను సీపీ గౌష్ ఆలం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ టూ టౌన్ పరిధిలో నివసించే కత్తి సురేశ్ (32) 2015లో మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.
సురేశ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిత్యం డబ్బుల కోసం మౌనికను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో దొమ్మాటి అజయ్‌తో ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త వేధింపులు భరించలేక అతడిని ఎలాగైనా హత మార్చాలని మౌనిక నిర్ణయించుకున్నది. ప్రియుడు అజయ్, తన బంధువుతోపాటు ఓ మహిళతో చర్చించింది. వారు మరో మహిళతోపాటు కరీంనగర్‌కు చెందిన మెడికల్ ఏజెన్సీ యజమాని పోతుల శివకృష్ణను పరిచయం చేశారు. సురేశ్‌కు వయాగ్రా, బీపీ మాత్రలు అధిక మోతాదులో ఇచ్చి హతమార్చాలని శివకృష్ణ సూచించాడు.
ఈ మేరకు నల్ల దేవదాసుతో మాత్రలు తెప్పించుకున్న మౌనిక, వాటిని కూరలో కలిపి తినిపించే ప్రయత్నం చేసింది. వాసన పసిగట్టిన సురేశ్ తినేందుకు నిరాకరించాడు. మరోసారి మెడికల్ ఏజెన్సీ యజమాని శివకృష్ణ సలహా తీసుకున్నది. అనంతరం దేవదాసు ద్వారా బీపీతోపాటు నిద్రమాత్రలు తెప్పించింది. గత నెల 17న సురేశ్ ఇంట్లో మద్యం తాగుతుండగా, ట్యాబ్లెట్లను చూర్ణం చేసి అందులో కలిపి తాగేలా చేసింది. సురేశ్ అపస్మారక స్థితికి వెళ్లగానే చీరతో ఉరేసింది.
చనిపోయాడని నిర్ధారించుకున్న మౌనిక తన అత్తామామలకు ఫోన్ చేసి చెప్పింది. లైంగిక చర్యల సమయం లో సురేశ్ స్పృహ కోల్పోయాడని తప్పుదోవ పట్టించింది. కుటుంబ సభ్యులు అతడిని దవాఖానకు తీసుకెళ్లి చికిత్స చేయించే ప్రయత్నం చేయగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి హత్యగా నిర్ధారించుకున్నారు. మౌనికతోపాటు ఆమెకు సహకరించిన అరిగె శ్రీజ, పోతు శివకృష్ణ, దొమ్మాటి అజయ్, నల్ల సంధ్య, నల్ల దేవదాసును గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీపీ వెల్లడించారు.