మహబూబాబాద్ రూరల్/ కేసముద్రం, డిసెంబర్ 24 : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్యతండాలో ఈనెల 22న జరిగిన ఓ వ్యక్తి హత్య ఉద్రిక్తతకు దారితీసింది. తండాకు చెందిన వీరన్న మంగళవారం రోడ్డుపై మృతి చెంది కనిపించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తులో భాగంగా బుధవారం మృతుడి ఇంటికి వెళ్లగా తండావాసులు చేరుకున్నారు. వీరన్న హత్యలో అతడి భార్య విజయ హస్తం ఉన్నదని దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో రాళ్లతో వారిపై దాడిచేశారు.
దీంతో ఎస్సైతో పాటు కానిస్టేబుల్‌కు గాయాలు కాగా మహబూబాబాద్ దవాఖానకు తరలించారు. విజయతో వివాహేతర సం బంధం పెట్టుకొని హత్యచేశారనే అనుమానంతో అదే తండాకు చెందిన బాలాజీ ఇంటిపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బాలాజీకి సహకరించాడని ఆర్ఎంపీ భరత్ క్లినిక్‌ని ధ్వంసం చేయడంతో పాటు అతడి ద్విచక్ర వాహనాన్ని దహనం చేశారు. కాగా ఓ ప్రైవేట్ సంస్థలో తీసుకున్న లోన్‌ను మాఫీ చేయించడానికే విజయ తన భర్తను చంపించిందని డీఎస్పీ తిరుపతిరావు మానుకోటలోని కార్యాలయంలో వెల్లడించారు. బోడమంచ్యతండాకు చెందిన భూక్యా వీరన్న (45) భార్య విజయకు అదే తండాకు చెందిన బోడ బాలాజీతో వివాహేతర సంబంధం ఉన్నది.
అప్పులు ఉండటంతో బాలాజీ తన స్థలంలో క్లినిక్ నిర్వహిస్తున్న ఆర్ఎంపీ ధర్మారపు భరత్‌తో ఓ ప్రైవేట్ సంస్థలో లోన్ ఇప్పించాడు. లోన్‌తీసుకున్న వారు ప్రమాదవశాత్తు చనిపోతే మాఫీ అవుతుందని తెలుసుకున్న విజయ.. ప్రియుడు బాలాజీతో కలిసి హత్యకు ప్లాన్ చేశారు. బాలాజీ, ఆర్ఎంపీలు వీరన్నను ఈనెల 22న రాత్రి ఊరు బయట ఉన్న పామాయిల్ తోటకు తీసుకొచ్చారు. మద్యం తాగిన అనంతరం బాలాజీ ఇనుప రాడ్డుతో వీరన్న తలపై బలంగా కొట్టి చంపాడు. అనంతరం రోడ్డుపై బైక్‌తో పాటు వీరన్న మృతదేహాన్ని పడవేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు. మృతుడి బంధువుల ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్ 2 4 గంటల్లోనే కేసును ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.