హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ భార్య ఘాతుకానికి పాల్పడింది. కట్టుకున్న భర్తనే రోకలిబండతో కొట్టి కిరాతకంగా హత్య చేసింది. ఇంట్లోనే మృతదేహాన్ని పాతిపెట్టింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని పిల్లలను బెదిరించింది. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం పాతచెరువులో నాలుగు నెలల క్రితం జరుగగా.. ఆలస్యంగా వెలుగు చూసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. పాత చెరువుకు చెందిన భర్త హనుమంతు, సుకన్యకు కొన్నేండ్ల క్రితం పెండ్లయింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుకన్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించిన భార్య అతడు నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో బలంగా కొట్టి హత్య చేసింది. అనంతరం ఇంటి ఆవరణలోనే భర్త శవాన్ని పాతిపెట్టింది. తల్లీకూతుళ్ల మధ్య తాజాగా గొడవ జరుగడంతో హత్యోదంతం వెలుగు చూసింది. దీంతో నిందితురాలు కల్యాణదుర్గం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.