Hand Casting : ఆ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో వారిని ఎదిరించి మరీ ఒక్కటయ్యారు. చిలుకా గోరింకల్లా కలిసి కాపురం చేశారు. వారి అన్యోన్య దాంపత్యానికి తీపిగుర్తుగా ఒక పాప జన్మించింది. కానీ కలతలు లేని వారి కాపురాన్ని చూసి విధికి కన్నుకుట్టింది. కళకళలాడే ఆ ఇంటిని కళా విహీనం చేసింది. అనారోగ్యంతో భార్య మరణించింది. దాంతో ప్రాణానికి ప్రాణంగా భావించిన తన భార్య జ్ఞాపకార్థం అతను చేసిన పని అందరి హృదయాలను గెలుచుకుంది.
ఖమ్మం జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్ల బంజర గ్రామానికి చెందిన అశోక్ కన్న, పద్మశ్రీ ప్రేమించుకుని 2006లో పెళ్లి చేసుకున్నారు. అశోక్ ప్రైవేట్ జాబ్ చేస్తూ సత్తుపల్లి పట్టణంలో స్థిరపడ్డారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే ఆనందంగా సాగుతున్న అశోక్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భార్య పద్మశ్రీ.. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న తన జీవిత భాగస్వామి ఆకస్మికంగా మృతి చెందడంతో అశోక్ తట్టుకోలేకపోయాడు. భార్య గుర్తుగా తన చేయి, తన కూతురు చేయి, చనిపోయిన తన భార్య చేయి నమూనాలతో విజయవాడ నుండి ప్రత్యేకంగా వచ్చిన కాస్టింగ్ నిపుణుల చేత హ్యాండ్ కాస్టింగ్ తయారు చేయించాడు. ఆ హ్యాండ్ కాస్టింగ్‌ను ఆమె గుర్తుగా పెట్టుకున్నాడు. మరణించిన భార్యను మరువలేక ఆ భర్త పడుతున్న వేదనను చూసి బంధుమిత్రులు కంటతడి పెట్టారు.