లింగాల గణపురం: జనగామ జిల్లా లింగాల గణపురం (Lingala Ghanapuram) మండలంలో పలు వార్డుల్లో అధికారులు గజిబిజిగా ఓటర్లను (Voter List) చేర్చడం గందరగోళంగా మారింది. అధికారులు ఏ ఇంటి నుంచి ప్రారంభించారో ఏ ఇంట్లో ముగించారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక వార్డుకు చెందిన ఓటర్లు మరో వార్డులో నమోదయ్యారు. దీంతో వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను మిగతా వార్డుల్లో నమోదవ్వడంతో వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.
లింగాల గణపురంలో 11వ వార్డులో కడకంచి నరసింహులు పేరు నమోదవగా, అతని భార్య కడకంచి లక్ష్మి పేరు తొమ్మిదో వార్డులో నమోదు చేశారు. ఒకే ఇంటిలో ఉంటున్న భార్యాభర్తలను రెండు వార్డుల్లో చేర్చడంతో ఆ కుటుంబ సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓకే వీధిలో పక్క పక్కనే ఉన్న మూడు ఇండ్లను అధికారులు మూడు వార్డుల్లో చేర్చి చేతులు దులుపుకున్నారు. మండలం మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామ సర్పంచ్ పదవికి ఓటు వేసే సమయంలో గ్రామ మొత్తాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ, వార్డు విషయానికి వచ్చేసరికి ఆయా వార్డుల్లోని ఓటర్లు మాత్రమే ఆయా వార్డు మెంబర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంతో వార్డు మెంబర్గా పోటీ చేసేవారు తమ ఓటర్లను ఇతర వార్డుల్లో ఎత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.