హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : అమెరికా సంయుక్త రాష్ర్టాల్లోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా తెలం‘గానం’ వినిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు ఏకకాలంలో జరిగే అరుదైన దృశ్యం కోసం యూఎస్ఏ వ్యాప్తంగా ఉన్న తెలంగాణబిడ్డలు ఎదురుచూస్తున్నారు. డాలస్‌లోని డాక్టర్ పెప్పర్ ఎరినా వేదిక మీద జూన్ 1వ తేదీ (భారత కాలమానం ప్రకారం జూన్ 2- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం)న అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించేందుకు యూఎస్‌లోని బిడ్డలు సమాయత్తమవుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డాలస్ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతారు.
అయితే, లండన్‌లో ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్ లిమిటెడ్ (పీడీఎస్ఎల్) సంస్థ నిర్వహించే సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని కేటీఆర్‌ను ఆహ్వానం అందిన నేపథ్యంలో ఇప్పటికే ఆయన లండన్ చేరుకున్నారు. లండన్ పర్యటన ముగిసిన అనంతరం ఆయన అక్కడి నుంచి అమెరికా వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. డాలస్ సభ నేపథ్యంలో వారం, పది రోజులుగా యూఎస్ఏలోని న్యూజెర్సీ, డేలావేర్, హూస్టన్, టెక్సాస్, కొలంబస్, ఆస్టిన్, ఫ్లోరిడా, శాన్ఫ్రాన్సిస్కో, లాస్ఏంజెల్స్, అష్బుర్మ్ తదితర నగరాల్లో నిర్వహించిన సన్నాహాక సమావేశాల్లో తెలంగాణ బిడ్డల నుంచి విశేష స్పందన లభించింది. యూఎస్ఏలోని అన్ని రాష్ర్టాల్లో ఉన్న తెలుగువారంతా అమితాసక్తిని చూపిస్తున్నారు. డాలస్ సభకు తాము సైతం హాజరవుతామని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎన్నారైలు, తానా, ఆటా సంస్థల్లోని ప్రతినిధులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
యూఎస్ఏలోని పలు రాష్ర్టాలు, నగరాల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగిన సందర్భాలను తలపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ అధినేత కేసీఆర్‌తో మమేకమై, ఆయన ఇచ్చే పిలుపునకు అనుగుణంగా ఎన్నారైలు కార్యరంగంలోకి దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పార్టీ ఆవిర్భావానికి కన్నా ముందు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆ తరువాత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నారైలు ఉద్యమించారు. 2001 నుంచి 2014లో స్వరాష్ట్ర స్వప్నం నెరవేరే వరకూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఉద్యమం, ఆ ఉద్యమ కీలక సందర్భాల్లో ప్రవాసంలో ఉన్న తెలంగాణబిడ్డలు తమతమ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలను డాలస్ సభ నేపథ్యంలో ఎన్నారైలు గుర్తుచేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పురోభివృద్ధికి పడిన అడుగులు, పదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని ఎన్నారైలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న కాంగ్రెస్ పాలన ఉమ్మడి రాష్ట్రం నాటి దుస్థితిని తలపిస్తున్నదని ఎన్నారైలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
డాలస్ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ ఎన్నారై సెల్ నేతలకు పార్టీ నేతలు అన్ని రకాలు గా అండగా నిలుస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోపాటు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు ఇప్పటికే అమెరికాకు చేరుకున్నారు. సన్నాహక సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. మరోవైపు డాలస్ సభ వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించేందుకు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సహా నేతలు, కళాకారులు అమెరికాకు పయనమయ్యారు. డాలస్‌లోని డాక్టర్ పెప్పర్ ఎరినా వేదికగా బతుకమ్మ, బోనాలు తదితర తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలను నిర్వహించేందుకు యూఎస్‌లో ఉంటున్న తెలంగాణబిడ్డలు సన్నద్ధమవుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలను ఇంటిపండుగలా విజయవంతం చేస్తామని డాలస్‌లోని తెలంగాణ ఎన్నారైలు ప్రకటించారు. జూన్ 1న డాక్టర్ పెప్పర్ ఎరినాలో జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల నేపథ్యంలో గురువారం డాలస్‌లో పలు తెలుగు ఎన్నారై సంస్థల ప్రతినిధులతో సన్నాహక సమావేశం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల, బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మహేశ్ తన్నీరు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో 25 ఏండ్లు మనుగడ సాగించిన పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటని చెప్పారు. ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను అట్టహాసంగా నిర్వహించుకున్నామని, ఇదే స్ఫూర్తితో డాలస్‌లో సభ జరుగుతున్నదని పేర్కొన్నారు. మహేశ్ బిగాల మాట్లాడుతూ.. డాలస్‌లోని అన్ని తెలుగు సంస్థలకు చెందిన ప్రముఖలందరూ సన్నాహక సమావేశానికి రావడం ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్పారు. జూన్ 1న డాలస్‌లో జరిగే సభకు అమెరికాలో ఉన్న తెలంగాణ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మహేశ్ తన్నీరు మాట్లాడుతూ.. డాలస్ సభకు వస్తున్నవారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.