హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వెనక భారీ కుట్రనే దాగి ఉన్నదని సాగునీటిరంగ నిపుణులు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ను, తద్వా రా కేసీఆర్‌ను బద్నాం చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలనే దురుద్దేశంతో మోదీ, రేవంత్, చంద్రబాబు కలయికలో ఘోష్ కమిషన్ ఏర్పాటైందని చెప్తున్నారు. రైతాంగానికి 365 రోజులు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్వీర్యం చేసే కుట్ర కూడా ఇందులో దాగి ఉన్నదని అనుమానిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరే అందుకు నిదర్శనమని చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ జలవనరులశాఖ సలహాదారుగా ఆదిత్యనాథ్‌దాస్ నియామకం అందులో భాగమేనని అంటున్నారు.
1999 నుంచి 2003 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీ జలవనరుల శాఖ ఇన్చార్జిగా ఆదిత్యనాథ్‌దాస్ పనిచేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014-19 వరకు చంద్రబాబు విభజిత ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఇరిగేషన్‌శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు. ఆ తరువాత జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడూ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఉద్యోగ విరమణ అనంతరం ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కొనసాగారు. మొత్తంగా గడచిన పదేండ్ల పాటు ఏపీ ప్రభుత్వ సేవలోనే ఉన్నారు. ఆ పదేండ్ల కాలంలో తెలంగాణ నీటి హక్కులను కాలరాసేందుకు ఏపీ ప్రభుత్వం తరఫున ఆదిత్యనాథ్‌దాస్ కీలకంగా పనిచేశారు. కాళేశ్వరంతో సహా కృష్ణా, గోదావరి బేసిన్లో తెలంగాణ నీళ్ల వాటాకు వ్యతిరేకంగా ఏపీ తరఫున పోరాడారు. తెలంగాణకు బద్ధ వ్యతిరేకిగా ఆదిత్యనాథ్ వ్యవహరించారు.
ఆదిత్యనాథ్‌కు రేవంత్ పగ్గాలు
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఆదిత్యనాథ్ ముద్రవేసుకున్నారు. గత ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు సీఎం అయ్యాక ఆదిత్యనాథ్‌దాస్‌ను నీటిపారుదల సలహాదారుడిగా నియమించుకుంటారని అందరూ భావించారు. కానీ, ఊహించని విధంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆదిత్యనాథ్‌కు ఇరిగేషన్ బాధ్యతలు అప్పగించింది. నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలియకుండానే ఈ నియామకం జరిగిందని కూడా ప్రచారం జరిగింది. కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు, కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్థకమని చిత్రీకరించేందుకు, తెలంగాణను పడావు పెట్టి రైతు ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే దాస్ నియామకం జరిగిందని అప్పట్లో ప్రచారం జరిగింది.
ఘోష్, దాస్ కలిసే వంటకం
జస్టిస్ పీసీ ఘోష్, ఆదిత్యనాథ్‌దాస్ కలిసి కోల్‌కతాలో నివేదికను వండివార్చారని నిపుణులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, చంద్రబాబుకు నమ్మకస్తుడైన టీటీడీ మాజీ జేఈవో శ్రీనివాసరాజును సైతం తెలంగాణ సీఎం ప్రిన్సిపల్ కార్యదర్శిగా నియమితులయ్యారు. మేడిగడ్డకు వ్యతిరేకంగా నివేదికలు తెప్పించుకునేలా ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీతో లాబీయింగ్ చేయడంలో, చంద్రబాబు, రేవంత్, మోదీ మధ్య సమన్వయకర్తలా వ్యవహరించడంలో శ్రీనివాసరాజుదే కీలక పాత్రని చెప్తున్నారు.
ఆ ముగ్గురి చీకటి ఒప్పందంలో భాగమే కాళేశ్వరం కమిషన్ అని అభివర్ణిస్తున్నారు. కమిషన్‌కు బాబు, మోదీ దర్శకత్వం వహిస్తే రేవంత్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరించారని, పాత్రధారులు జస్టిస్ పీసీ ఘోష్, ఆదిత్యనాథ్‌దాస్, శ్రీనివాసరాజు అని చెప్తున్నారు. జస్టిస్ ఘోష్‌ను కలిసేందుకు ఆదిత్యనాథ్ 9సార్లు కోల్‌కతాకు వెళ్లడమే అందుకు నిదర్శనమని వాదిస్తున్నారు. కోల్‌కతాలో ఘోష్‌ను ఆదిత్యనాథ్ కలవలేదని రేవంత్ నిరూపించగలరా? సెల్‌ఫోన్ గూగుల్ లొకేషన్లను బయట పెట్టగలరా? చంద్రబాబు, రేవంత్ చెప్పినట్టు కాళేశ్వరం నివేదికను సిద్ధం చేయలేదని చెప్పగలరా? అని నీటిరంగ నిపుణులు సవాల్ విసురుతున్నారు.
తమిళనాడు ఎన్నికల్లో లబ్ధి కోసమే
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు, తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు రేవంత్ చేసిన కుట్రే కాళేశ్వరం కమిషన్ అని నిపుణులు ఆరోపిస్తున్నారు. గోదావరి-కావేరి అనుసంధానం కోసం కాళేశ్వరాన్ని, తద్వారా తెలంగాణను బలిపెట్టే కుట్ర దాగి ఉందని అనుమానిస్తున్నారు. కుకను చంపాలంటే ముందు పిచ్చికుక అని ఎలాగైతే ముద్ర వేస్తారో, కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ పేరిట నిరర్ధక ప్రాజెక్టు అని ముద్రవేసి బలిపెట్టేందుకు పూనుకున్నారని చెప్తున్నారు. మళ్లీ ముఖ్యమంత్రి కావడం అసాధ్యమని తెలిసే రేవంత్ బీజేపీ వైపు చూస్తున్నారని, అందులో భాగంగానే ఎక్కువగా మోదీ, అమిత్ షాను కలుస్తున్నారని వివరిస్తున్నారు. తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టును బాబు, మోదీ కోసం రేవంత్‌రెడ్డి పడావు పెడుతున్నారని వివరిస్తున్నారు. అందులో భాగంగానే కమిటీలు, కమిషన్ అని హడావుడి చేస్తున్నారని విమర్శిస్తున్నారు.